కలం, వలిగొండ : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రవేశపెట్టిన “ప్రజావాణి” కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో (Valigonda MPDO) జలంధర్ రెడ్డి కోరారు. సోమవారం నుంచి మండలంలో తొలిసారిగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని అన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరవుతారని, ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, సమస్యల పరిష్కారంలో పారదర్శకత మరియు వేగం పెంచడం లక్ష్యంగా ప్రజావాణి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

