కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) నియోజకవర్గ పరిధిలో కలకలం రేపిన సీరియల్ హత్యల ముఠా గుట్టును సిద్దిపేట పోలీసులు రట్టు చేశారు. కేవలం బంగారం, డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్న భూంపల్లికి చెందిన చాకలి రజిత (38)తోపాటు ఆమె మైనర్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రశ్మీ పెరుమాళ్ మీడియాకు వెల్లడించారు. భూంపల్లికి చెందిన అతికం విజయ (45) హత్యకు గురై, దహనమైన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
విచారణలో భాగంగా రజిత, ఆమె కుమారుడు కలసి అతికం విజయతోపాటు కుంట రేఖ అనే మరో మహిళను గొంతు పిసికి చంపారు. ఆధారాలు లభించకుండా పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు నిర్ధారణ అయింది. గతంలోను అన్నపూర్ణ అనే మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న 5 తులాల పుస్తెల తాడును దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. విచారణ సమయంలో పోలీసులకు మరో సంచలనాత్మక విషయం తెలిసింది. డబ్బు, బంగారం కోసం మరో నలుగురిని వరుసగా హత్య చేసేందుకు వీరు ముందస్తు పథకం వేసినట్లు సీపీ తెలిపారు.
నిందితుల వద్ద నుంచి రూ. 1,03,000 నగదుతో పాటు 5.61 తులాల బంగారం, 53 తులాల వెండి ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన TVS XL వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు చాకలి రజితకు రిమాండ్ విధించారు. మైనర్ కుమారుడిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు సీపీ రశ్మీ పెరుమాళ్ పేర్కొన్నారు.

