కలం, వరంగల్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి పరకాల (Parakala) నియోజకవర్గానికి అభివృద్ధి వరాలు ప్రకటించారు. పరకాల పట్టణానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. మొదట రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.45.15 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట (Erragattu Gutta) వరకు రూ.65 కోట్లతో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పూర్తయితే నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పర్యాటక, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుంది.
వంద పడకల ఆసుపత్రికి..
పరకాల పట్టణంలో రూ.35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, నియోజకవర్గంలోని దామెర మండలం ల్యాదేళ్లలో రూ.32.17 కోట్ల అంచనా వ్యయంతో పరకాల ఇందిరా మహిళా డెయిరీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పరకాల మున్సిపాలిటీలో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు రూ.82 కోట్లతో శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.1.10 కోట్లతో విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రూ.5 కోట్లతో ఆలయ అభివృద్ధి..
పరకాల (Parakala) పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు రూ.5 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆత్మకూర్‌లో టౌన్షిప్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు శంకుస్థాపన చేయగా, అక్కంపేటలో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి ప్రణాళిక పనులకు శ్రీకారం చుట్టారు. ఆత్మకూర్‌లో రూ.కోటితో నిర్మించిన అధునాతన SPM సెంటర్‌ను ఇక్కడి నుంచే సీఎం ప్రారంభించారు. పరకాల నియోజకవర్గంలో విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, మహిళా సాధికారత, పట్టణాభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ భారీ స్థాయిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Also Read : అసెంబ్లీకి రండి.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Follow Us On: X(Twitter)

