మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!

కలం, స్పోర్ట్స్: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పి.వి. సింధు (PV Sindhu) మరో ప్రపంచ ఛాంపియన్‌షిప్ సమరానికి సిద్ధమయ్యారు. న్యూఢిల్లీ వేదికగా సోమవారం నుంచి ప్రారంభమవుతున్న ఈ టోర్నీలో ఆమె బరిలోకి దిగుతున్నారు. పోటీలకు ముందు ఆదివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో సింధు మాట్లాడారు. గతంలో ఎదురైన ఓటములే తనను మరింత దృఢంగా మార్చాయని ఆమె స్పష్టం చేశారు. సింధు కెరీర్‌లో ఇప్పటివరకు ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సాధించారు. 2013, 2014 లలో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

ఆ తర్వాత 2017, 2018 లలో రజత పతకాలు సాధించారు. చివరికి 2019 లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. తన ప్రయాణంలో ఎదురైన తీవ్రమైన పరాజయాలే తనను ఆటలో రాటుదేలేలా చేశాయని సింధు వెల్లడించారు. ముఖ్యంగా 2017 లో గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో నజోమి ఒకుహర చేతిలో ఓటమి తీవ్రంగా బాధించిందని ఆమె చెప్పారు. గంటా 50 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో స్వల్ప తేడాతో విజయం చేజారిందని తెలిపారు. అలాగే 2018 లో ఎదురైన పరాజయాలు కూడా తనలో కసిని పెంచాయని వివరించారు.

2019 లో పసిడి గెలిచిన నాటితో పోలిస్తే ఇప్పుడు తన ఆట శైలిలో స్పష్టమైన మార్పులు వచ్చాయని సింధు (PV Sindhu) అన్నారు. ప్రస్తుతం మహిళల సింగిల్స్ ఆట వేగవంతమైన దాడి కంటే సుదీర్ఘ ర్యాలీల వైపు మారిందని చెప్పారు. కోర్టులో మైండ్ గేమ్‌తో పాటు సుదీర్ఘ సమయం ఓపికగా ఆడటం చాలా ముఖ్యమని తెలిపారు. కోర్టులో గాలి దిశ, షటిల్ కంట్రోల్ వంటి పరిస్థితులను అంచనా వేస్తూ సమయానుకూలంగా ఆడటంలో తనకు అనుభవం పెరిగిందని పేర్కొన్నారు.

ఎన్ని టోర్నీలు ఆడినా మొదటి రౌండ్ మ్యాచ్‌లకు ముందు ఒత్తిడి, ఆందోళన సహజమేనని ఆమె అంగీకరించారు. అయితే శ్రమను నమ్ముకుని కోర్టులోకి దిగి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఫలితం ఏదైనా సరే పూర్తి శ్రమను కోర్టులో పెడతానని చెప్పారు.ఇన్ని ఏళ్లయినా ఆట పట్ల తనకున్న ఆకలి, ఆసక్తి కొంచెం కూడా తగ్గలేదని సింధు స్పష్టం చేశారు. సొంతగడ్డపై అభిమానుల మద్దతు మధ్య ఆడుతుండటం మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : ఆస్ట్రేలియాను కూల్చిన బంగ్లా.. ప్రధాని ప్రశంసలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>