కలం, నిర్మల్ : ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి (Prajavani) కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని ఇకపై మండల కేంద్రాల్లోనూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో సోమవారం నుంచి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించనున్నారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)ను నోడల్ అధికారిగా నియమించారు.మండల స్థాయి ప్రజావాణికి 23 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. ఆయాసమస్యలను సంబంధిత శాఖల పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. దీంతో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ఒకే వేదికపై ఫిర్యాదు చేసే అవకాశం కలగనుంది. ప్రజావాణి(Prajavani)లో స్వీకరించే ప్రతి ఫిర్యాదును ఏకీకృత పోర్టల్లో నమోదు చేయనున్నారు. దరఖాస్తుతో పాటు సమర్పించే సంబంధిత పత్రాలను స్కాన్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రతి ఫిర్యాదుదారుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో కూడిన రసీదును అందజేయనున్నారు. దీంతో తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు, స్కానర్లు, ఇంటర్నెట్ సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలాంటి జాప్యం లేకుండా నమోదు చేసి, సంబంధిత శాఖలకు పంపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.మండల స్థాయిలో ప్రజావాణి ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మరింత చేరువలో వేదిక లభించినట్టయింది.
జిల్లా కేంద్రాలకు వెళ్లే ఇబ్బందులు తగ్గడంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కానుంది. అయితే ప్రజావాణి విజయవంతం కావడం కేవలం ఫిర్యాదులు స్వీకరించడంపైనే ఆధారపడదు. ప్రజల నుంచి అందిన ప్రతి వినతిని సంబంధిత అధికారులు పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించడం, పరిష్కార స్థితిని ఫిర్యాదుదారులకు తెలియజేయడంపైనే అసలు విజయం ఆధారపడి ఉంటుంది. మండల స్థాయిలో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూర్చాలంటే అధికారుల పర్యవేక్షణ, జవాబుదారీతనం కీలకం.
Also Read : అసెంబ్లీకి రండి.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Follow Us On: Instagram

