కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో (POCSO) కేసుల దర్యాప్తు, కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారుల లైంగిక దాడులు, లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా కేసుల్లో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, నిందితుల గుర్తింపు, అరెస్టులు, సేకరించిన ఆధారాలు, సాక్షుల వివరాలు, బాధిత చిన్నారుల వాంగ్మూలాలు, కేసుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉందనే విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయడం, బాధిత చిన్నారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా దర్యాప్తును వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పోక్సో కేసుల్లో చిన్నారుల భద్రత గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని , బాధితుల పట్ల సున్నితమైన వైఖరితో వ్యవహరించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన ఎఫ్ఎస్ఎల్ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేయించి నివేదికలు పొందాలని ఆదేశించారు.
బాధితులు, నిందితులకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కేసుల్లో లభించిన సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాంకేతిక ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించి, వాటిని దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని సీపీ (CP Sai Chaitanya) అధికారులకు సూచించారు.
సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను పకడ్బందీగా నమోదు చేసి కేసులు కోర్టులో బలంగా నిలిచేలా దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మల్లేషం, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్.అంజయ్య, సీఐలు, ఐటీ కోర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Also Read : హైదరాబాద్ సిటీ పోలీస్‌లో ఉద్యోగాలు.. వారే అర్హులు!
Follow Us On: X(Twitter)

