కలం, నిజామాబాద్ బ్యూరో: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్‌పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజా సంక్షేమం తిరిగి గాడిన పడాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం కొనాపూర్, కేసీ తండా కు చెందిన సీనియర్ నాయకులు లకావత్ కన్నయ్య, చిలివేరి సత్యనారాయణ, తండా పెద్దమనిషి దేవులునాయక్, గుగ్లవత్ శ్రీనివాస్ నాయకత్వంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వేల్పూర్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth) వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ… ఎన్నికల వేళ మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని, పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచుతామని, రూ.500కే గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనులు, సాధారణ రైతులకు రేవంత్ సర్కార్ తీరని అన్యాయం చేస్తోందన్నారు.
రూ.2 లక్షల రుణమాఫీ సగం మంది రైతులకు కూడా అందలేదని, కేసీఆర్ (KCR) హయాంలో నిరంతరాయంగా అందిన రైతుబంధును రూ.15,000కు పెంచుతామని చెప్పి మోసం చేశారన్నారు. గతంలో ఉన్న రూ.10,000ను కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎగ్గొట్టి రైతులను ఆగం చేశారన్నారు. గతంలో ఫోన్ చేయగానే పొలాల వద్దకే ఎరువులు చేరే పరిస్థితి ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో యాప్‌ల పేరుతో రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.
యూరియా, ఎరువుల కోసం అన్నదాతలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి, కోనాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉతకం నర్సయ్య, బడాలా రమేష్ PACS చైర్మన్, బడాలా రాజారెడ్డి, పుర్కుటపు చిన్నారెడ్డి, పురుషోత్తం, జాల రాజు, పాలేపు గంగారెడ్డి, బోట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : బాడీగార్డ్‌ను తొలగించిన చరణ్.. ఆ స్టార్ హీరో చెంతకు కెవిన్!
Follow Us On : WhatsApp

