కలం, వెబ్డెస్క్: కడప (Kadapa) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చికెన్ పకోడితో మొదలైన గొడవ తమ్ముడి చేతిలో అన్న హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బ్రహ్మంగారిమఠానికి చెందిన సురేష్, వెంకటసుబ్బయ్య అన్నాదమ్ములు. వీరిద్దరికీ గతంలోనే పెళ్లిళ్లు అయినప్పటికీ మద్యానికి బానిసలు కావడంతో ఇద్దరినీ భార్యలు వదిలి వెళ్లిపోయారు. శనివారం రాత్రి తమ్ముడు సురేష్ మద్యం తాగి బయట హోటల్ నుంచి చికెన్ పకోడీ తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న అన్న వెంకటసుబ్బయ్య శనివారం రోజు ఇంట్లోకి చికెన్ ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించాడు.
చికెన్ పకోడీ గురించి మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఆగ్రహించిన సురేష్ ఇంట్లోకి వెళ్లి గొడ్డలి తీసుకొచ్చి అన్న వెంకటసుబ్బయ్య తలపై దాడి చేశాడు. దీంతో వెంకటసుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి సురేష్ వెళ్లిపోయాడు. బయట మద్యం సేవించి మళ్లీ ఇంటికి వచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న వెంకటసుబ్బయ్యను చూసి మరోసారి గొడ్డలితో దాడి చేశాడు. దీంతో వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సురేష్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read : విజయవాడలో టీచర్ల భారీ ఆత్మగౌరవ ర్యాలీ!
Follow Us On: Instagram

