పల్లె బాట పట్టిన ‘యాప్ టాక్సీలు’.. గ్లోబల్ దిగ్గజాలకు లోకల్ స్టార్టప్‌ల సవాల్!

కలం, ఖమ్మం బ్యూరో: ఒకప్పుడు ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సేవలు కేవలం హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలు, మెరిసే ఐటీ కారిడార్లకే పరిమితమయ్యేవి. స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క టచ్‌తో నచ్చిన వాహనం ఇంటి ముంగిట వాలే సంస్కృతి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక సుదూర స్వప్నం.

రాత్రివేళల్లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలన్నా, పక్క ఊరికి ప్రయాణించాలన్నా గంటల తరబడి వేచి చూడటం లేదా అధిక ఛార్జీలు చెల్లించడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితి ఉండేది. కానీ సాంకేతికత విస్తరించి, పల్లెల్లో సైతం స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిన నేటి కాలంలో రవాణా రంగ ముఖచిత్రం చాలా వేగంగా మారుతోంది. ఈ యాప్ ఆధారిత రవాణా విప్లవం ఇప్పుడు నగరాల సరిహద్దులు దాటి గ్రామీణ బాట పట్టింది. బహుళజాతి కార్పొరేట్ దిగ్గజాలకు ధీటుగా, చిన్న పట్టణాలు పల్లెల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న స్థానిక స్టార్టప్‌లు గ్రామీణ ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చేస్తున్నాయి.

పల్లె ప్రజల ముందుకు సర్వీసులు..

​ఈ సరికొత్త సాంకేతిక మార్పునకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలంలో రూపుదిద్దుకున్న ‘KTS సర్వీస్’ యాప్ ప్రారంభమే ప్రత్యక్ష నిదర్శనం. ‘నిటాల్ జీఎస్ టెక్నాలజీస్’ పేరిట స్థానిక యువత ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఈ స్టార్టప్, ఒకప్పుడు కేవలం మహానగరాలకే సొంతమైన యాప్ టాక్సీ సదుపాయాన్ని పల్లె ప్రజల ముందుకు తెచ్చింది. దమ్మపేట పరిధిలోని ప్రజలు ఇప్పుడు తమ అవసరానికి తగ్గట్లుగా ఆటో, బైక్, కార్లలో సురక్షితంగా ప్రయాణించే సదుపాయం లభించింది. నగరాల్లో లభించే 24/7 జిపిఎస్ ట్రాకింగ్ వంటి భద్రతా ప్రమాణాలను గ్రామీణ స్థాయికి తీసుకురావడమే కాకుండా, త్వరలోనే ప్రత్యేకంగా మహిళా డ్రైవర్ల సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించడం పల్లె ప్రయాణాల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఇది కేవలం రవాణా సౌకర్యం మాత్రమే కాక, గ్రామీణ మహిళల భద్రతకు, సాధికారతకు బాటలు వేసే ఒక గొప్ప పరిణామం.

యువతకు భరోసా..

ఈ మార్పు కేవలం ఒక్క ఊరికే పరిమితం కాలేదు. వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో ‘ఈ-యాన్’ ఎలక్ట్రిక్ ఆటోలతో పర్యావరణహిత విప్లవం సృష్టిస్తుంటే, ‘మనా యాత్రి’ వంటి యాప్‌లు ONDC నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తూ వినూత్న బాట పట్టాయి. సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు డ్రైవర్ల సంపాదనలో 20 నుండి 30 శాతం కమిషన్లుగా పిండేస్తుంటే, ఈ స్థానిక యాప్‌లు డ్రైవర్ల నుంచి పైసా కమిషన్ తీసుకోని ‘జీరో-కమిషన్’ మోడల్‌ను తెచ్చాయి. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ధరకు ప్రయాణం దొరుకుతుంటే, ఆటో, బైక్ నడిపే స్థానిక యువతకు తాము కష్టపడిన సొమ్ము దమ్మిడి తగ్గకుండా చేతికి అందుతోంది.

సొంతూళ్లలోనే ఆదాయం..

​ఒకప్పుడు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కో, బెంగళూరుకో వలస వెళ్లిన కుర్రాళ్లు ఇప్పుడు సొంత ఊళ్లలోనే గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందుతున్నారు. నిజామాబాద్, ఖమ్మం, నల్గొండలలో కుర్రాళ్లు ఆటో యూనియన్లను వాట్సాప్ బాట్‌లతో డిజిటలైజ్ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు సవాల్ విసురుతున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా ఒకప్పుడు చిన్న గ్యారేజీల్లో మొదలైనవే. ఈ రోజు తెలంగాణ పల్లె సీమల్లో చిగురిస్తున్న ఈ చిన్న స్టార్టప్‌లు కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించడం లేదు; స్థానిక సమస్యలను స్థానిక సాంకేతికతతోనే పరిష్కరించుకోవచ్చనే ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, నగరాలకు-పల్లెలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపివేసి నవభారత పురోగతికి సరికొత్త బాటలు వేస్తున్నాయి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రెట్టింపు ప్రయోజనం..

​ఈ రకమైన హైపర్-లోకల్ (Hyper-local) మోడల్స్ విస్తరించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రెట్టింపు ప్రయోజనం చేకూరుతోంది. ఒకవైపు ప్రయాణికులకు సురక్షితమైన, సరసమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంటే, మరోవైపు స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా సొంత ఊర్లోనే గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తోంది. కార్పొరేట్ దిగ్గజాలు కేవలం అధిక ఆదాయం వచ్చే అర్బన్ మార్కెట్లపైనే దృష్టి సారిస్తే, KTS వంటి స్థానిక స్టార్టప్‌లు పల్లెల అవసరాలను గుర్తించి సేవలందిస్తున్నాయి.

నూతన విప్లవం..

ప్రపంచంలో పేరుగాంచిన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు ఒకప్పుడు చిన్న ఆలోచనతో ప్రారంభమై అంతర్జాతీయ స్థాయికి ఎదిగినవే. గ్రామీణ ప్రాంతాల నుంచి యువత వ్యవస్థాపకులుగా ముందుకొచ్చి ఇటువంటి అడుగులు వేయడం సమిష్టి గ్రామీణ ప్రగతికి సంకేతం. బహుళజాతి సంస్థలు చేరుకోలేని మారుమూల ప్రాంతాలకు స్థానిక స్టార్టప్‌లు చేరువై, సాంకేతిక పరిజ్ఞానంతో పల్లెల రూపురేఖలను మారుస్తూ నూతన భారతీయ విప్లవానికి శ్రీకారం చుడుతున్నాయి.

పల్లె సీమల్లోనూ స్టార్టప్ సంస్కృతి..

ఈ యాప్ విప్లవం కేవలం రవాణా సేవలకు మాత్రమే పరిమితం కాదు, ఇది గ్రామీణ యువత ఆత్మవిశ్వాసానికి, సాంకేతికత అందించిన సాధికారతకు గొప్ప ప్రతీక. మహానగరాల వెలుగుల్లో మెరిసే స్టార్టప్ సంస్కృతి ఇప్పుడు పల్లె సీమల్లోనూ చిగురిస్తూ, స్థానిక సమస్యలకు స్థానిక యువతద్వారానే పరిష్కారాలు వెతకవచ్చని నిరూపిస్తోంది. డిజిటల్ విప్లవంతో అడుగులు వేస్తున్న ఇటువంటి చిన్న ప్రయత్నాలే రేపటి రోజున గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే ప్రధాన యంత్రాలుగా మారనున్నాయి. పల్లె బాట పట్టిన ఈ ‘యాప్ రవాణా’ మున్ముందు మరెన్నో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి, నగరాలకు-పల్లెలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెరిపివేస్తూ నవభారత పురోగతికి సరికొత్త దిశను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>