కలం, జోగులాంబ గద్వాల: అర్హులైన వారికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేలా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుందని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు పాల్గొని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 1.90 లక్షల రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. మొదటగా 150 మంది లబ్ధిదారులకు అందిస్తున్నామని, మిగతా వారికి 15 రోజులలో రేషన్ షాపు డీలర్ల ద్వారా సర్పంచులు, గ్రామ కార్యదర్శుల సమక్షంలో అందిస్తామన్నారు.
అవినీతికి తావు లేకుండా..
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకమన్నారు. రేషన్ డీలర్లు అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యాన్ని పారదర్శకంగా అందించేలా కొత్త కార్డులను రూపొందించామన్నారు. రెవెన్యూ అధికారులు రేషన్ షాపుల డీలర్లు ప్రతి ఇంటికి కార్డులను అందించాలన్నారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తెచ్చిందన్నారు.
12 ఏళ్లుగా ఎదురు చూపులు..
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. రేషన్ కార్డు ద్వారా అన్ని సంక్షేమ పథకాలను అందుతాయన్నారు. కొత్తగా రూపొందించిన కార్డులను ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా అందించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నల్ల హనుమంతు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నీలి శ్రీనివాసులు, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు

