కలం, వెబ్‌డెస్క్: భారత్ పెద్ద క్రీడా టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వడమే కాదు.. పతకాల పట్టికలోనూ అగ్ర దేశాల సరసన నిలవాలని మాజీ ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) అన్నారు. అప్పుడే భారత్‌ను నిజమైన క్రీడా దేశంగా పిలవగలమని పేర్కొన్నారు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నిర్వహించిన ‘మల్హార్’ కార్యక్రమంలో సైనా మాట్లాడారు. దేశంలో క్రీడల పరిస్థితి గత 10-20 ఏళ్లలో చాలా మారిందన్నారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు.
హర్యానాకు చెందిన పలువురు అమ్మాయిలు క్రీడల్లో రాణిస్తున్నారని సైనా పేర్కొన్నారు. రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లో మహిళల ప్రదర్శన మెరుగైందన్నారు. ఈ మార్పు దేశవ్యాప్తంగా కనిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువ క్రీడాకారులకు చిన్న వయసు నుంచే ఆర్థిక సహాయం అందాలని సైనా అన్నారు. టాప్ 15 లేదా టాప్ 20లోకి వస్తేనే చాలా క్రీడల్లో మంచి స్పాన్సర్‌షిప్‌లు, నిధులు లభిస్తున్నాయని చెప్పారు.
ఫలితాలు రావడానికి ఒక్కో క్రీడాకారుడికి ఒక్కో సమయం పడుతుందని గుర్తు చేశారు. ప్రారంభ దశ నుంచే ప్రమోషన్, మార్కెటింగ్, స్పాన్సర్షిప్ అందితే మరింత మంది ప్రతిభావంతులు క్రీడల్లో కొనసాగుతారని సైనా అభిప్రాయపడ్డారు. క్రీడా మౌలిక వసతులతో పాటు సరైన కోచింగ్ కూడా అవసరమని ఆమె చెప్పారు. సైకాలజిస్టులు, మానసిక శిక్షకులు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు ఎక్కువగా ఉండాలని సూచించారు.
గత ఐదారు ఏళ్లలో ఈ విభాగాల్లో కొంత మెరుగుదల కనిపించిందని సైనా అన్నారు. అయితే మరింత మంది క్రీడాకారులకు మానసిక బలం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పది మంది క్రీడాకారుల్లో కనీసం ఆరుగురు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇతర క్రీడల్లోనూ క్రికెట్ తరహా ఆర్థిక భద్రత ఉంటే ఆటగాళ్లు దీర్ఘకాలం కొనసాగేందుకు అవకాశం ఉంటుందని సైనా అన్నారు.
ప్రపంచ స్థాయిలో నిలవడం, గాయాల నుంచి కోలుకోవడం, ఒత్తిడిని తట్టుకోవడం అంత సులభం కాదని చెప్పారు. మంచి జీతం, ఉద్యోగ భద్రత వంటి అవకాశాలు ఉంటే క్రీడను వృత్తిగా ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతుందని సైనా అభిప్రాయపడ్డారు. ప్రతిభ ఉన్న పిల్లలు ఎంతో మంది ఉన్నారని, వారికి మంచి కోచ్, సరైన బృందం, మానసిక సహాయం అందితే మరింత మంది ఛాంపియన్లుగా ఎదగగలరని పేర్కొన్నారు.

