కలం, నిజామాబాద్ బ్యూరో: సాధారణంగా అంబులెన్స్ వస్తే అంతా దారి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ (Ambulance Traffic Signal) వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పుడు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఒక్కోసారి దారి ఇవ్వాలన్న ఆ పరిస్థితి ఉండదు. అప్పటికే అక్కడ అంతా వాహన శ్రేణి నిలిచి ఉంటుంది. కాబట్టి అంబులెన్స్ వెళ్లడానికి వీలుండదు. కానీ అంబులెన్స్ లో వెళ్లే ఎమర్జెన్సీ పేషెంట్లకు నిమిష నిమిషం ప్రాణగండమే.
ఎంత తొందరగా ఆసుపత్రికి వెళ్ళగలిగితే అంత ప్రాణానికి భరోసా ఉంటుంది. ధర్నాలు జరిగినప్పుడు కానీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు గానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఇతరత్రా కారణాలతో అంబులెన్సులు ట్రాఫిక్ మధ్యలో నిలిచిపోయి ప్రాణాలు పోయిన సంఘటనలు గతంలో చూశాం. అయితే నిజామాబాద్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు (Nizamabad Students) అనురాగ్ ఆధ్వర్యంలో ఓ సరికొత్త ప్రాజెక్టును రూపొందించారు. అది రోగుల పాలిట ప్రాణదాతగా మారడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
సంజీవని “ప్రాణ” సేతు:
నిజామాబాద్ విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ కు చెందిన అనురాగ్ దుంపేటి బీటెక్ (ECE) మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆయనకు వచ్చిందే ఈ సంజీవని “ప్రాణ” సేతు (Prana Sethu) ఆలోచన. ముందుగా ఇంట్లో ప్రయోగం చేశాడు. తన సహచర విద్యార్థులు శశాంక్ చల్లగాలి, సార్థిక్ అంకంవార్ తో కలిసి 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో స్టాల్స్‌లో తొలిసారిగా ఈ ప్రయోగం ప్రదర్శించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి స్టాల్స్ పరిశీలించారు.
ప్రాణసేతు అనే ప్రాజెక్టు తయారు చేసింది అనురాగ్ టీం. రెండు డివైజులు తయారు చేశారు. ఒకటి ట్రాన్స్ మీటర్.. అంబులెన్స్‌లో అమరుస్తారు.. రెండోది ట్రాఫిక్ జంక్షన్ దగ్గర అమర్చేది రిసీవర్.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి అంబులెన్స్ రాగానే అంబులెన్స్ ఎటువైపు ఉంటే అటువైపు ఆటోమేటిక్‌గా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. వెంటనే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. దాంతో పాటే అంబులెన్స్ కూడా మూవ్ అవడానికి వీలుంటుంది. ఈ ప్రాజెక్ట్ రూపొందించడానికి వారం రోజుల సమయం పట్టిందని టీమ్ లీడర్ అనురాగ్ కలంతో చెప్పారు.
గోల్డెన్ టైం కిల్ కావొద్దు: అనురాగ్
ఎమర్జెన్సీ సమయాలలో అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకునే సమయం గోల్డెన్ టైం. ట్రాఫిక్ జామ్ వలన వాహనాలు నిలిచిపోయి ఆ టైం కిల్ కావొద్దు. రేడియో ప్రీక్వెన్సీ Rf మాడ్యూల్ ను ఉపయోగించి ప్రాణ సేతు ప్రాజెక్టుతో గ్రీన్ సిగ్నల్ వచ్చి అంబులెన్స్ వెళ్ళిపోతుంది. అంబులెన్స్‌లకు ఎమర్జెన్సీలో టైం ఉండదు. ప్రాణాలకు ప్రమాదం కాబట్టి తొందరగా కదలాలి. హాస్పిటల్‌లో డాక్టర్స్ రెడీ ఉంటారు. అత్యవసర ప్రమాదంలో ఉన్న వారికి రోడ్ క్లియర్‌గా ఉండాలి.. సరైన సమయంలో హాస్పిటల్‌కు రీచ్ అయితే కచ్చితంగా బ్రతుకుతారు.
ప్రభుత్వం గుర్తించాలి: శశాంక్
మొదటి సారిగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాబ్‌లో ప్రదర్శించాం.. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.ఇది అమలైతే ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. ప్రయోగాత్మకంగా ప్రభుత్వం గుర్తించి రాష్ట్రం అంతటా అమలు చేయాలి.
ఇలాంటి ప్రాజెక్టులతో యువతకు ప్రోత్సాహం ఇవ్వాలి: సార్థిక్
యువత చేస్తున్న ఇన్నోవేటివ్ ఆలోచనలకు కార్యరూపం దాలిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాదు కొత్త ఆలోచనలు ఆవిష్కృతం అవుతాయి. దానివల్ల సమాజానికి జనాలకు దోహదం అవుతుంది. దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి జనాల ప్రాణాలు ఆరోగ్యం అన్ని అంశాల్లో ముందుకెళ్లడానికి వీలుంటుంది.

