స్మార్ట్ రేషన్ కార్డులతో అవినీతికి చెక్: మంత్రి జూపల్లి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: స్మార్ట్ రేషన్ కార్డులతో సరుకుల పంపిణీ సులభతరం కానుందని, అవినీతికి తావు ఉండదని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మంత్రి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. గత పదేళ్లలో కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్ కొత్త రేషన్ కార్డులను జారీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం ద్వారా అదనంగా సన్న బియ్యం అందించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో కొత్త కార్డులతో కలిపి మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 2,79,523 కు చేరిందన్నారు. 9,61,377 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు.

డిజిటల్ రేషన్ కార్డులతో పారదర్శకత..

సాంకేతికతను వినియోగించుకుని రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా మార్చినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, కొత్త సభ్యుల చేరిక, వివాహం అనంతరం పేర్ల మార్పు వంటి ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే స్మార్ట్ రేషన్ కార్డుల ప్రధాన ఉద్దేశమన్నారు. రేషన్ దుకాణాలకు వచ్చిన సరుకులు, వాటి నిల్వలు, లబ్ధిదారులకు పంపిణీ చేసిన సరుకుల వివరాలను సైతం పారదర్శకంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యానికి బోనస్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను మాత్రం ఆపడం లేదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

20 వేల కొత్త రేషన్ కార్డులు: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదల ఆహార భద్రత, ఆరోగ్య భద్రతకు రేషన్ కార్డు ఎంతో కీలకమన్నారు. 2014 నుంచి 2023 వరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదని, కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యుల పేర్లను కూడా చేర్చుకునే అవకాశం లేక ఎంతో మంది ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కార్డుల జారీకి చర్యలు చేపట్టిందన్నారు.

దేవరకద్ర నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 63,367 రేషన్ కార్డులు ఉన్నాయని, వీటిలో 20 వేల కొత్త రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. మే 31వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. తదుపరి దశలో అర్హులైన వారికి కూడా ఇస్తామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు మొబైల్‌లో కనిపిస్తాయని ఎమ్మెల్యే వివరించారు.

తిరగాల్సిన అవసరం ఉండదు: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ స్కాన్ చేస్తే కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల వివరాలను ఎప్పుడైనా సులభంగా పరిశీలించుకోవచ్చన్నారు. పేర్లు చేర్చడం, తొలగించడం వంటి వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దీంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. రేషన్ డీలర్లకు కూడా వివరాలను స్పష్టంగా తెలియజేయడం సులభమవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, ట్రైనీ కలెక్టర్ సాయి శివాని, జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బెక్కరి అనిత, మేయర్ జి.మమత, భూత్పూర్ మున్సిపల్ ఛైర్మన్ మూడావత్ బాలకోటి, డి.ఎస్.సి.ఓ గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>