కలం, నాగర్జునసాగర్ : అంతర్జాతీయ ప్రమాణాలతో నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధ వనము (Sagar Buddhavanam)లో వియత్నాం దేశపు గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం ఆ దేశ ప్రతినిధులు, ఇంజనీర్లు స్థల పరిశీలన చేశారు. గతంలో ఎన్నోసార్లు బుద్ధవనాన్ని సందర్శించిన వియత్నాం దేశ ప్రతినిధులు బుద్ధ వనములో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో శనివారం బుద్ధవనంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలలో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తో కలిసి పాల్గొన్న అనంతరం బుద్ధుని విగ్రహ ఏర్పాటుకు అనుకూలమైన స్థలం కోసం పరిశీలించారు.
ఈ సందర్భంగా బుద్ద వనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. వియత్నాం దేశపు అమితాబ బుద్ధ విగ్రహాన్ని బుద్ధ వనంలో ఏర్పాటు చేయటానికి ఆసక్తి కనబరిచారని తెలిపారు. దీనిలో భాగంగా శనివారం బుద్ధ వనం లోని పలు ప్రదేశాలను పరిశీలించారన్నారు. సుమారు 45 అడుగుల అమితాబ బుద్ధ విగ్రహాన్ని ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న డిజిటల్ మ్యూజియం సమీపంలో ఏర్పాటు చేయడానికి వియత్నాం దేశ ప్రతినిధులు సంసిద్ధత తెలియజేశారన్నారు. వియత్నాం బుద్ధ విగ్రహ ఏర్పాటుకై బుద్ధవనం ప్రాజెక్ట్ తరపున ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నామని అనుమతి రాగానే విగ్రహ ఏర్పాటు జరుగుతుందని ఆయన తెలిపారు.
సాగర్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బుద్ధవనం పరిధిలో మరో ఆకర్షణీయమైన వియత్నాం బౌద్ధ బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. బుద్ధ విగ్రహానికి స్థల పరిశీలన చేసిన వారిలో వియత్నాం దేశానికి చెందిన ప్రతినిధులు గుయేన్, తీ కిమ్ లాంగ్ గుయేన్, నహుట్ మిన్హ్ ట్రాన్, కొ్క్ ఫామ్ ఫామ్, వాన్ హాయ్, గుయేన్ లే థాంహ్ తమ్, ఉంగ్ తన్ థే, ఫామ్ అన్హ్ డూయ్, గుయేన్ లే థాంహ్ గుయేన్ లు ఉన్నారు. అనంతరం వీరు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. వీరితోపాటు బుద్ధవనం డి ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏ ఈ నజీష్, ఆర్ అండ్ బి డి ఈ సతీష్, ఏ ఈ ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాం సుందర్ రావు, టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు.

