కలం, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా కలెక్టర్ తీరుపై వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను భూకబ్జాదారుడిగా చిత్రీకరించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను దోషిగా నిరూపిస్తే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చుకుంటానని సవాల్ విసిరారు.
ఈ వ్యవహారంలో తిరుపతి కలెక్టర్ పై చట్టపరంగా పరువునష్టం కేసు వేయనున్నట్లు స్పష్టం చేశారు. కలెక్టర్ బినామీలను అడ్డుపెట్టుకొని ఇసుక, మట్టి వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరును అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేశారని మండిపడ్డారు.
22A నిబంధనల పేరు చెప్పి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కలెక్టర్ వైఖరిపై కచ్చితంగా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
తనపై రహస్య విచారణ జరపాలంటూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్వయంగా ఎస్పీకి లేఖ రాశారని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తనపై రహస్య విచారణలు చేయడానికి తనేమీ పాకిస్థాన్ టెర్రరిస్ట్ లేదా నక్సలైట్ కాదని ధ్వజమెత్తారు.
కలెక్టర్ రాసిన సదరు లేఖ తమకు ఆన్‌లైన్‌లో లభించగానే వెంటనే హైకోర్టును ఆశ్రయించామని ఆయన పేర్కొన్నారు. అయితే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామనే విషయం తెలియగానే ఆ లేఖను ఆన్‌లైన్ నుంచి మాయం చేశారని భూమన ఆరోపించారు.

