ఎల్‌నినో ప్రభావం.. మంత్రి జూపల్లి కీలక సూచనలు

కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) సూచించారు. ప్రస్తుత నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని అధిక నీటి అవసరమయ్యే వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధ్యక్షతన నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సాగునీటి, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షించారు.

ఎగువ నుంచి నీరు వస్తేనే..

జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌, ఆర్డీఎస్‌, కేఎల్‌ఐ, భీమా తదితర ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటిమట్టాలు, రానున్న రోజుల్లో తాగు, సాగునీటి అవసరాలపై చర్చించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రస్తుతం ప్రాజెక్టులకు వరద రావడంతో నీటి నిల్వలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి నీటి విడుదల జరిగితేనే దిగువ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో వస్తుందని, ప్రస్తుతం అక్కడి నుంచి నీటి విడుదల నిలిచిపోయిందని వివరించారు.

వరికి బదులు ఆరుతడి : మంత్రి జూపల్లి

వర్షాలు కురవకపోతే డిసెంబరు వరకు వానాకాలం పంటలకు నీరు అందించడం కష్టమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. నీటి లభ్యతపై స్పష్టత లేని పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు వెళ్లకుండా మినుము, వేరుశనగ, ఆయిల్‌ పామ్‌ తదితర ఆరుతడి పంటలను ఎంచుకునేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గితే ‘ఆన్‌–ఆఫ్‌’ పద్ధతిలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు.

నీటి వివరాలు వెల్లడించాలి: మంత్రి వాకిటి శ్రీహరి

ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది.. ఎంత విడుదల చేస్తున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. వాస్తవ పరిస్థితులను రైతులకు స్పష్టంగా తెలియజేసి, అందుబాటులో ఉన్న నీటికి అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకునేలా చూడాలని సూచించారు.

బోర్లు రీచార్జ్‌ అయ్యేలా చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, కేఎల్‌ఐ ద్వారా శ్రీశైలం నీటిని వనపర్తి రైతులకు అందించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. నార్లాపూర్‌, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నింపేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే వరి వేసిన రైతులను ఆదుకునేందుకు కొంతమేర సాగునీరు విడుదల చేయాలని, కొత్తకోట మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్‌ను నింపాలని కోరారు.

‘ఆన్‌–ఆఫ్‌’ పద్ధతిలో నీరు విడుదల చేయాలి: ఎమ్మెల్యే బండ్ల

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జూరాల, నెట్టెంపాడు నుంచి వారానికి మూడు రోజులు ‘ఆన్‌–ఆఫ్‌’ పద్ధతిలో నీరు విడుదల చేయాలని కోరారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ బోర్లపై ఆధారపడి వరి సాగు చేస్తున్న రైతులకు ఆన్‌–ఆఫ్‌ నీటి విడుదలతో బోర్లు రీచార్జ్‌ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

కోయిల్‌సాగర్‌లో మరమ్మతులకు గురైన మోటార్లను వెంటనే బాగు చేయాలని కోరారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌ శివసేనారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లు, సాగునీటి, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>