కలం, స్పోర్ట్స్ : నైజీరియాలోని లాగోస్‌లో జరుగుతున్న కామన్వెల్త్ ఫెన్సింగ్ (Commonwealth Fencing) ఛాంపియన్‌షిప్ మూడో రోజున భారత ఫెన్సర్లు అద్భుత ప్రదర్శనతో మెరిసారు. సీనియర్ల విభాగంలో భారత్ ఏకంగా 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో మొత్తం 5 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత పతకాల సంఖ్య ఏకంగా 29కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. టోర్నీ ఆరంభంలో సీనియర్ మహిళల ఫొయిల్ విభాగంలో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కనగలక్ష్మి గోల్డ్ మెడల్ సాధించగా, జోయ్స్ అషిత సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.
ఇంగ్లాండ్‌కు చెందిన జార్జియా గ్రీన్, ఎమిలీ గుడ్‌చైల్డ్ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత సీనియర్ పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షెర్జిన్ అద్భుత ప్రతిభ చూపి భారత్‌కు రెండో స్వర్ణాన్ని అందించారు. సౌతాఫ్రికాకు చెందిన క్రూగర్ పీటర్ రజతం సాధించగా, వేల్స్‌కు చెందిన బర్క్‌హార్డ్ మార్క్, సౌతాఫ్రికాకు చెందిన లోసెవ్‌స్కీ సెర్గీ కాంస్య పతకాలు పంచుకున్నారు. సీనియర్ పురుషుల సాబ్రే విభాగంలో కరణ్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన షిమ్ యూంగీపై విజయం సాధించి మూడో స్వర్ణాన్ని గెలుచుకున్నారు.
ఇదే విభాగంలో భారత్‌కు చెందిన కుమారేసన్ పద్మ గిషో నిధి, నైజీరియాకు చెందిన అకిన్యోసోయే ఒలువఫోలయేమితో కలిసి కాంస్య పతకం సాధించారు. పోటీలు ముగింపు దశకు చేరుకోవడంతో, ఇక మిగిలిన విభాగాల్లో కూడా పతకాలే లక్ష్యంగా భారత బృందం బరిలోకి దిగుతోంది. భారత క్రీడాకారులు చివరి వరకు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

