కలం, నిర్మల్: ఏళ్ల తరబడి పట్టించుకోని డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలతో ఎన్హెచ్ఏఐ అధికారులు రంగంలోకి దిగారు. సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలో జాతీయ రహదారి-44కు ఇరువైపులా పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారం తొలగింపు పనులు గత వారం రోజులుగా యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హైదరాబాద్-నాగ్పూర్ మధ్య జాతీయ రహదారి-44ను నాలుగు లైన్లుగా విస్తరించిన సమయంలో కడ్తాల్ గ్రామంలో రహదారికి ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించారు. అయితే రహదారి విస్తరణ అనంతరం ఇప్పటివరకు డ్రైనేజీలలో పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఏళ్లుగా భారీగా చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో వర్షాకాలంలో మురుగునీరు డ్రైనేజీల నుంచి బయటకు వచ్చి ఇళ్లలోకి చేరడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుర్గంధంతో పాటు దోమల బెడద పెరగడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదు.
ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి సమస్య
ఇటీవల గ్రామంలో నూతన పాలకవర్గం ఏర్పడిన అనంతరం సర్పంచ్ గుర్రం రాము ఆధ్వర్యంలో గ్రామస్థులు జూలై 27న నిర్వహించిన ప్రజావాణిలో డ్రైనేజీ సమస్యను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గుర్తించిన కలెక్టర్ వెంటనే స్పందించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సంబంధిత ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి డ్రైనేజీలను తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాలతో ఎన్హెచ్ఏఐ సిబ్బంది రంగంలోకి దిగి డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. దీంతో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు నూతన పాలకవర్గం చొరవతో పరిష్కారం లభించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం కావాలి
డ్రైనేజీలను ఇకపై క్రమం తప్పకుండా శుభ్రం చేయడంతో పాటు వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

