కలం, నారాయణపేట: మతం కులం ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని నారాయణపేట (Narayanapet) జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి బస్సు యాత్ర కర్ణాటక రాష్ట్రం రాయచూర్ నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా బుధవారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
అనంతరం మాగనూరు, మక్తల్, ఉట్కూర్ మీదుగా నారాయణపేట (Narayanapet) జిల్లా కేంద్రానికి రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి బస్సు యాత్ర చేరుకుంది. ముందుగా జిల్లా కేంద్రంలోని నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం ఈ యాత్ర కొనసాగిస్తున్నట్టు తెలిపారు. రాజీవ్ గాంధీ దేశంలో మత సామరస్యం, జాతీయ సమైక్యత, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.
దేశం, రాష్ట్రంలోని ప్రజలు సోదరభావంతో కలిసి జీవించాలనే సందేశాన్ని ఈ యాత్ర ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, సామాజిక సమానత్వం కోసం నిలబడుతుందన్నారు. యాత్రలో రాజీవ్ సద్భావన జ్యోతి యాత్ర కన్వీనర్ దోరై వేలు స్వామి, యాత్ర ప్రధాన కార్యదర్శి సుజేంద్ర శెట్టి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి, నారాయణపేట మండలం అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : హార్దిక్ ప్యాండ్యాకు షాక్.. తిరస్కరించిన గిల్!
Follow Us On: Instagram

