కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను (Adilabad CCI Plant) తిరిగి ప్రారంభించాలని ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన యువజన గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీసీఐ పునఃప్రారంభంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమండ్ చేశారు.
రాబోయే అసెంబ్లీ సమావేశంలో పరిశ్రమ పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలన్నారు. అలాగే అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లాల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన కాలంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన ఆరోపించారు. పరిశ్రమల మూతకు బీజేపీ పాలన వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకుడు జోగురామన్న మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ పరిశ్రమ పునప్రారంభాన్ని పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. పరిశ్రమ పునఃప్రారంభం చేయకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైన నిధులు మంజూరు చేసి తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేంత వరకు పోరాటం చేస్తామని రామన్న హెచ్చరించారు.

