కలం, వెబ్ డెస్క్ : రైస్ మిల్లర్ల గోల్ మాల్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. మిల్లర్ల బ్లాక్ మెయిలింగ్ ను సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.. ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సివిల్ సప్లయిస్ శాఖ పైన సీఎం రేవంత్ అధ్యక్షన జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలని.. బకాయిల వసూలుకు ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బకాయిల వసూలే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా డిఫాల్ట్ అయి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.
స్వాధీనం చేసుకున్న మిల్లులను మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న గోడౌన్ లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతల్ని కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తానని సీఎం స్పష్టం చేశారు.
5 నియోజక వర్గాల్లో మహిళా సంఘాలకు 50 నుంచి 100 ఎకరాల్లో గోడౌన్ ల నిర్మాణం కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని.. ధాన్యం ఎక్కువ దిగుబడి అయ్యే ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయాలని చెప్పారు. గోడౌన్ ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం లో నిధులను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించాలని సీఎం ఆదేశాలిచ్చారు.

