కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : పండుగ సాయన్న తరువాత ప్రజల మనసులో చిరస్థాయిగా బతికిన మహానాయకుడు ఎర్ర సత్యం అని మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగా బుధవారం మహబూబ్‌నగర్ లో ఎర్ర సత్యమన్న విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ సారథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన ఎర్ర సత్యం ప్రజలకు అందించిన సేవలు అమోఘమని కొనియాడారు.
పండుగ సాయన్న నాడు పెద్దలను కొట్టి పేదలకు పంచినట్లు సత్యమన్న కాంపౌండ్ కు పోతే పేదవారికి న్యాయం జరిగేదని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎర్ర సత్యం నిరంతరం కృషి చేశారని, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, సేవా భావం నేటి తరానికి ఆదర్శమని అన్నారు. ఎర్ర సత్యం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మంత్రి వాకిటి (Vakiti Srihari) పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) మాట్లాడుతూ.. ఎర్ర సత్యం గొప్ప ధైర్యశాలి.. ప్రజల కోసం నిలబడిన నాయకుడని కొనియాడారు. ప్రజా సమస్యలపై నిర్భయంగా పోరాడిన ఆయన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలో ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎర్ర సత్యం అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
Also Read : బ్లాక్ మెయిల్ చేస్తారా..? మిల్లర్లపై సీఎం సీరియస్
Follow Us On: Sharechat

