కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మూడు దుకాణాల్లో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది. ఒకషాపులో నగదు ఎత్తుకెళ్లిన దొంగలు మరో రెండు షాపుల్లో విఫలయత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. సమద్ కాంప్లెక్స్ లోని నూరని ట్రేడర్స్ దుకాణం షట్టర్ ను గడ్డపారతో పైకి లేపిన దుండగులు కౌంటర్ లో ఉన్న సుమారు రూ.7 వేల నగదును ఎత్తుకెళ్లారు.
అదే ప్రాంతంలోని విద్యుత్ కార్యాలయం పక్కన ఉన్న నారాయణ ఫ్యాన్సీ, రాజారాం ట్రేడింగ్ దుకాణాల షట్టర్లను సైతం గడ్డపారతో లేపి దొంగతనానికి ప్రయత్నించారు. బుధవారం ఉదయం దుకాణాలకు వచ్చిన యజమానులు షట్టర్ల తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

