కలం, స్పోర్ట్స్ బ్యూరో: ఐదు దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) పీఠం కోసం భారత్ మరోసారి సర్వశక్తులూ ఒడ్డుతున్నది. ఎనిమిది సార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు.. ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం 51 ఏళ్లుగా నిరీక్షణ ఎదురవుతూనే ఉంది. దశాబ్దాల కరవును ముగించి, ఐరోపా గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలనే పట్టుదలతో ఈసారి బరిలోకి దిగుతున్నది.
భారత పురుషుల హాకీ జట్టు చివరిసారిగా 1975లో ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన చారిత్రాత్మక ఫైనల్లో పాకిస్థాన్‌ను 2-1తో మట్టికరిపించి అజిత్‌పాల్ సింగ్ కెప్టెన్సీలో ఏకైక ప్రపంచకప్‌ను గెలుచుకున్నది. ఆ తర్వాత గడిచిన 51 ఏళ్లలో టీమిండియా కనీసం ఒక్కసారి కూడా సెమీఫైనల్‌కు చేరలేదు. 2023లో స్వదేశంలో జరిగిన టోర్నీలోనూ భారత్ 9వ స్థానంతో సరిపెట్టుకున్నది. మరోవైపు, మహిళల జట్టుకు అసలు ప్రపంచకప్ టైటిల్ రికార్డే లేదు. 1974లో జరిగిన ప్రారంభ ఎడిషన్‌లో సాధించిన 4వ స్థానమే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన.
ఈసారి పరిస్థితులు భిన్నం
ఈసారి పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్య పతకాలు సాధించిన పురుషుల జట్టు ప్రస్తుతం మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో అనుభవం, యువత కలయికతో బరిలోకి దిగుతున్న భారత్.. ప్రపంచకప్‌లోనూ అదే స్థాయి ప్రదర్శనను రిపీట్ చేయాలని చూస్తున్నది. అటు మహిళల జట్టు కూడా ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ‘నేషన్స్ కప్ 2026’ టైటిల్‌ను గెలుచుకుని భీకర ఫామ్‌లో ఉన్నది.
గ్రూప్ – డీలో భారత్, పాక్
ప్రపంచకప్ ఆరంభంలోనే భారత్‌కు గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి. పురుషుల జట్టు పూల్-డీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్‌తో తలపడనుంది. ఆగస్టు 15న వేల్స్‌తో తొలి మ్యాచ్ ఆడే భారత్.. 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్థాన్‌తో పోరాడుతుంది. ఇక ఆగస్టు 16న చైనాతో జరిగే మ్యాచ్‌తో అమ్మాయిలు కప్ వేటను ప్రారంభిస్తారు. ఆగస్టు 18న సౌతాఫ్రికాతో, ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో తలపడతారు.
సెమీస్‌కు కొత్త దారి
సాధారణంగా ఏ టోర్నీలోనైనా లీగ్ దశ ముగియగానే క్వార్టర్ ఫైనల్స్ మొదలవుతాయి. కానీ ఈసారి ప్రపంచకప్‌లో ఆ పద్ధతికి గుడ్‌బై చెప్పారు. జట్లను నాలుగు పూల్స్ (ఏ, బీ, సీ, డీ)గా విభజించారు. లీగ్ దశలో ప్రతి పూల్‌లో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఇంటర్మీడియట్ రౌండ్ (క్రాస్ఓవర్ పూల్స్)కు చేరతాయి. అక్కడి పోరులోనూ పైచేయి సాధించి అగ్రస్థానాల్లో నిలిచిన జట్లకే సెమీఫైనల్ బెర్త్ దక్కుతుంది. అంటే లీగ్ దశలో ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికి పోయే ప్రమాదం ఉండదు. కానీ, సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే.
ఈ ప్రపంచకప్‌లో ఆటగాళ్లు పరుగులు పెట్టే మైదానం కూడా ప్రత్యేకమే. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేలా దాదాపు 80 శాతం చెరకుతో తయారుచేసిన ‘పోలిగ్రాస్’ కృత్రిమ టర్ఫ్‌ను నిర్వాహకులు సిద్ధం చేశారు.
రెండు దేశాల ఆతిథ్యం
హాకీ ప్రపంచకప్‌ను ఈసారి బెల్జియం, నెదర్లాండ్స్ కలిసి నిర్వహిస్తున్నాయి. రెండు దేశాల్లోని అత్యుత్తమ హాకీ వేదికలపై ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. భారత పురుషుల జట్టు తన పూల్ మ్యాచ్‌లన్నింటినీ నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్లో ఆడనుండగా.. మహిళల పోటీలు కూడా నెదర్లాండ్స్, బెల్జియం వేదికల్లోనే సాగనున్నాయి. రెండు దేశాల్లోనూ హాకీకి ఉన్న విశేష ఆదరణ నేపథ్యంలో.. ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లకు భారీ ప్రేక్షకాదరణ లభించే అవకాశం ఉంది.
ఫేవరెట్లు వీరే
పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీతో పాటు ఆతిథ్య జట్లు నెదర్లాండ్స్, బెల్జియం టైటిల్ రేసులో ప్రధాన ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. అటాకింగ్ హాకీలో దూకుడుకు మారుపేరైన నెదర్లాండ్స్.. ఒత్తిడిని జయించడంలో దిట్టలైన జర్మనీ.. సొంతగడ్డపై ప్రేక్షకుల మద్దతుతో బరిలోకి దిగుతున్న బెల్జియం మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. అయితే టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్యాలు సాధించిన భారత్‌కు తక్కువ అంచనా వేయలేం. ఈ టోర్నీలో ‘డార్క్ హార్స్’గా ఏ జట్టుకైనా షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక మహిళల విభాగంలో ప్రస్తుత ఛాంపియన్ నెదర్లాండ్స్ జట్టు తిరుగులేని నంబర్ 1 ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది.
పాకిస్థాన్‌దే రికార్డు
ప్రపంచకప్ చరిత్రను చూస్తే పురుషుల విభాగంలో పాకిస్థాన్ అత్యధికంగా నాలుగుసార్లు టైటిల్ గెలిచి అగ్రస్థానంలో ఉంది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, జర్మనీ తలా మూడుసార్లు చొప్పున ఛాంపియన్లుగా నిలిచాయి. భారత్, బెల్జియం ఒక్కోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాయి. మహిళల విభాగంలో మాత్రం నెదర్లాండ్స్ ఆధిపత్యం తిరుగులేనిది. ఆ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు ప్రపంచకప్ గెలవగా.. అర్జెంటీనా, జర్మనీ, ఆస్ట్రేలియా తలా రెండుసార్లు చొప్పున టైటిల్ సాధించాయి.

