దొంగతనాలపై అసత్య కథనాలు వద్దు: నిర్మల్ ఎస్పీ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో దొంగతనాలకు సంబంధించి వాస్తవాలను పరిశీలించకుండా, గోరంతలను కొండంతలుగా చూపిస్తూ ప్రజలలో భయాందోళనలు కలిగించేలా అసత్య కథనాలను ప్రచురించడం సరికాదని జిల్లా ఎస్పీ(Nirmal SP) జానకి షర్మిల(Janaki Sharmila) అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. వాస్తవ ఆధారాలతో చేసే విమర్శలను స్వాగతిస్తామని ఎస్పీ తెలిపారు. అయితే నిరాధార ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించే కథనాలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఆస్తి నేరాల నియంత్రణ, ఛేదన కోసం జిల్లాలో రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

గత వారం రోజులలో 20 ఆస్తి నేరాల కేసులను ఛేదించడంతో పాటు మరో 15 కేసులలో కీలక ఆధారాలను సేకరించినట్లు ఎస్పీ తెలిపారు. బైంసా, నిర్మల్, నిర్మల్ రూరల్, మామడ, సారంగాపూర్, లక్ష్మణచాంద, తానూర్, కడెం తదితర ప్రాంతాలలో  జరిగిన ఇంటి దొంగతనాలు, ఆలయ చోరీలు, ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా బైంసాలో ఐదు, నిర్మల్‌లో ఏడు, సారంగాపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 13 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచినట్లు తెలిపారు. కీలక ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేశామని అన్నారు.

అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు జిల్లాలోని పలు ఆలయాలు, ఇళ్లలో జరిగిన చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ చెప్పారు. పెద్ద నేర ముఠాల కదలికలపైనా దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయిన వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని మరిన్ని కేసులను ఛేదిస్తామని తెలిపారు. వార్తలను ప్రచురించే ముందు సంబంధిత అధికారుల వివరణ తీసుకుని వాస్తవాలను ప్రజలకు అందించాలని మీడియాకు ఎస్పీ సూచించారు. ఆలయ కమిటీలు, వ్యాపారులు, ప్రజలు తమ పరిసరాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>