కరీంనగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పై సోయి లేదా?: సర్దార్ రవీందర్ సింగ్

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థలో గత మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంపై కరీంనగర్ మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ , సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

తెలంగాణ మున్సిపాలిటీల్లో పాలనా వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన 2021 నిబంధనల ప్రకారం కనీసం ప్రతి నెలా ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మున్సిపల్ వ్యవహారాలపై చర్చించాల్సి ఉందని సర్దార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. అయితే కరీంనగర్ నగరపాలక సంస్థలో వరుసగా మూడు నెలలుగా సమావేశాలు నిర్వహించకపోవడం ప్రజాస్వామ్య పాలనా విధానానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని తాను పలుమార్లు మౌఖికంగా కోరినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కౌన్సిల్‌ను ఎందుకు నిర్వహించడం లేదు? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు..

ప్రజల సమస్యలు, డివిజన్ల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. కౌన్సిల్ సమావేశాలు సక్రమంగా నిర్వహించకపోతే ప్రజా సమస్యలను అధికారికంగా చర్చించే వేదిక లేకుండా పోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ROC.No.341423-2021-H1, తేదీ 24-12-2021 మార్గదర్శకాల ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు, సమావేశాలకు సంబంధించిన నివేదికలు, కంప్లయన్స్‌ను సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిల్ సమావేశాల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సర్దార్ రవీందర్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు. “ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు ప్రజా సమస్యలను కౌన్సిల్‌లో ప్రస్తావించడానికి అవకాశం కల్పించాలి. మున్సిపల్ పాలన పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగాలి. నిబంధనల ప్రకారం కౌన్సిల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి” అని సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంపై కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి, CDMA అధికారులకు నగర మాజీ మేయర్ , సర్దార్ రవీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>