కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Telangana SIR) సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 73,39,234 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు చేరలేదు. వీరి వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. 45,18,961 మంది ఓటర్లు తెలంగాణ నుంచి శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తమ ఓటును బదిలీ చేసుకున్నారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే చట్ట ప్రకారం నేరం. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకే వీరంతా తమ స్వస్థలాల్లో ఓటు నమోదు చేసుకోవడానికి మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. 9,22,230 మంది ఓటర్లు మరణించగా, 11,25,546 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదు. 6,70,203 మంది ఓటర్లు మరో చోట ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఇతర కారణాల వలన 1,02,294 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదు.
ఓటర్ల సంఖ్య 2.64 కోట్లు..
తెలంగాణలో సర్ (Telangana SIR) ప్రక్రియ చేపట్టే నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 3,38,26,448 గా ఉంది. ప్రతి ఓటరుకి బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. తిరిగి ఇచ్చినవారి పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో నమోదు చేసి, ఓటర్లుగా గుర్తించి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇచ్చిన ఫారాలను బీఎల్వోలు డిజిటలైజేషన్ చేస్తుంటారు. 73,39,234 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇవ్వలేదు. అర్ధరాత్రి వరకు 2,64,87,214 మంది ఓటర్లవి డిజిటలైజేషన్ చేశారు. ప్రస్తుతానికి ఓటర్లుగా వీరి సంఖ్యనే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Also Read : 20 ఏళ్లు దాటాయా.. ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే!
Follow Us On : WhatsApp

