20 ఏళ్లు దాటాయా.. ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా మూత్ర పిండాల వ్యాధి కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే 20 ఏళ్లు దాటిన వ్యక్తులు ప్రతి ఆరు నెలలకోసారి కిడ్నీ టెస్ట్‌లు (Kidney Tests) చేయించుకోవడం తప్పనిసరి చేయాలనే విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న దీర్ఘ కాలిక వ్యాధుల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ మొదటి వరుసలో ఉందని, ప్రజల్లో మాత్రం కనీస అవగాహన లేదని విచారం వ్యక్తం చేసింది. వ్యాధి ముదిరిన తరువాతనే ఆసుపత్రులకు వెళ్లడం, ఖర్చులతో బాధితులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని వివరించింది. ఈ మేరకు ఇటీవలే   నివేదిక విడుదల చేసింది.

అవసరమైతే ఉచితంగానే..

కిడ్నీ పనితీరు గురించి తెలుసుకోవాలంటే సాధారణంగా క్రియాటినిన్ పరీక్ష చేస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో కిడ్నీల పనితీరు దెబ్బతిన్న కేసుల్లో కూడా క్రియాటినిన్ స్థాయిల్లో పెద్ద తేడాలు ఉండటం లేదని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో యూరిన్ ఆల్బుమిన్, EGFR వంటి అత్యాధునిక పరీక్షలు మేలని సిఫార్సు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వీటి ఖర్చు ఎక్కువగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వమే జాతీయ విధానం తీసుకొచ్చి పేదలకు ఉచితంగానే కిడ్నీ టెస్టులు నిర్వహించాలని విన్నవించింది. అంతేగాకుండా ఇక నుంచి సాధారణంగా రోగులకు జరిపే ఉచిత పరీక్షల్లో EGFR టెస్ట్ కూడా చేర్చాలని సూచించింది.

కిడ్నీ పనితీరు ఎలా దెబ్బతింటుందంటే..

కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలను కూడా పార్లమెంటరీ స్థాయీ సంఘం వివరించింది. బీపీ, డయాబెటిక్ సమస్యలతో పాటు డీ హైడ్రేషన్ కూడా మరో ప్రధాన ముప్పుగా పేర్కొంది. ఎండల్లో పనిచేసే వ్యవసాయ కూలీల్లో డీ హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా ఒంట్లో నీటి నిల్వలు తగ్గిపోయి నేరుగా మూత్రపిండాలపై ప్రభావం చూపి కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీస్తున్నట్లు వివరించింది. కలుషితమైన నీటిని తాగడం వలన, అందులోని ప్రమాదకర లోహాలు శరీరంలోకి చేరి కిడ్నీలు పాడవడానికి దోహదం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయాలని కోరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>