కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ కెప్టెన్, బేయర్న్ మ్యూనిక్ స్టార్ హ్యారీ కేన్ (Harry Kane) మరో అరుదైన ఘనత సాధించాడు. 2025-26 సీజన్‌లో యూరప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గోల్డెన్ షూ అవార్డు అందుకోనున్నాడు. దీంతో ఈ ప్రతిష్టాత్మక అవార్డును రెండుసార్లు గెలుచుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో కేన్ చేరనున్నాడు. అతని కంటే ఎక్కువసార్లు ఈ అవార్డును గెలిచిన వారిలో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో మాత్రమే ఉన్నారు. ఆగస్టు 19న బేయర్న్ మ్యూనిక్ మ్యూజియంలో గోల్డెన్ షూ అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. గత సీజన్‌లో కేన్ క్లబ్, దేశం తరఫున 65 పోటీ మ్యాచ్‌లు ఆడి ఏకంగా 73 గోల్స్ చేశాడు. అదనంగా ఎనిమిది అసిస్టులు అందించాడు.
బుండెస్లిగాలో గోల్స్ పంట
బుండెస్లిగాలో కేన్ 36 గోల్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండేళ్ల క్రితం కూడా ఇదే సంఖ్యలో గోల్స్ చేసి గోల్డెన్ షూ అందుకున్నాడు. దీంతో వరుసగా మూడోసారి బుండెస్లిగా టాప్ స్కోరర్‌గా నిలిచిన ఘనత సాధించాడు. బేయర్న్ మ్యూనిక్ విజయాలలో కేన్ కీలక పాత్ర పోషించాడు. జర్మన్ కప్ ఫైనల్‌లో హ్యాట్రిక్ సాధించి జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు. ఆ టోర్నీలోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2025-26 ఛాంపియన్స్ లీగ్‌లో కూడా రెండో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మరో అరుదైన రికార్డు
యూరప్‌లోని టాప్-5 లీగ్‌లలో ఒకే క్లబ్ తరఫున 100 గోల్స్‌ను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా కేన్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ కెప్టెన్‌గా ప్రపంచకప్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచి జట్టును సెమీఫైనల్‌కు చేర్చాడు. ఆ టోర్నీలో ఏడు గోల్స్ చేశాడు. ఇంగ్లండ్ 1966 తర్వాత ప్రపంచకప్‌లో సాధించిన అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేయడంలో కేన్ కీలకంగా వ్యవహరించాడు.
బేయర్న్ చరిత్రలో మూడో ఆటగాడు
బేయర్న్ మ్యూనిక్ చరిత్రలో గోల్డెన్ షూ అవార్డును గెలుచుకోనున్న మూడో ఆటగాడిగా హ్యారీ కేన్ నిలవనున్నాడు. ఇంతకుముందు క్లబ్ దిగ్గజాలు గెర్డ్ ముల్లర్, రాబర్ట్ లెవాండోస్కీ ఈ అవార్డును గెలుచుకున్నారు. కేన్ ఘనతపై బేయర్న్ మ్యూనిక్ ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. అతని గోల్స్ మాత్రమే కాకుండా జట్టు కోసం చేసే కృషి, నాయకత్వ లక్షణాలను ప్రత్యేకంగా అభినందించారు.

