కలం, కరీంనగర్ బ్యూరో: సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెలెక్కిందని, రానున్న రోజుల్లో అదే సోషల్ మీడియా ద్వారా ప్రజలు వాస్తవాలను గమనించి బీజేపీని గద్దెదించుతారని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకే సీపీఐ ఆధ్వర్యంలో 6వ తేదీన కరీంనగర్ లో ప్రారంభమైన ప్రచార జాతా 5వ రోజున తిమ్మాపూర్ (Thimmapur ) కు చేరుకుందని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు.
తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి, మొగిలిపాలెం, పొలంపల్లి గ్రామాల్లో జరిగిన ప్రచార జాతా కార్యక్రమానికి సీపీఐ మండల కార్యదర్శి బోయిని తిరుపతి అధ్యక్షత వహించారు. ఈ జాతా కు ముఖ్య అతిథిగా హాజరైన పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో విపరీతంగా అబద్ధపు ప్రచారాలు చేసుకొని యువత ఓట్లు కొల్లగొట్టారని, అవన్నీ అబద్ధపు ప్రచారాలనీ ఇప్పుడిప్పుడే యువత తెలుసుకుంటుందని, తీవ్ర నిరాశకు గురవుతున్న యువత వారి భవిష్యత్తు కోసం మార్పు కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇదే సోషల్ మీడియా వేదికగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు, నిరాశ నిస్పృహలు పెరిగిపోయి ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం చెందారని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యంలో అతి పెద్దది నిరుద్యోగమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిదని మండిపడ్డారు. సామాన్య, పేద , మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ధరల పెరుగుదలను నియంత్రించలేని మోదీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు.
దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతలను కేంద్రం ఆదుకోవడం లేదని, వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కి చట్టపరమైన హామీ ఇవ్వాలనే డిమాండ్ ఇంకా పరిష్కారం కాలేదన్నారు. విద్య, వైద్యం కార్పొరేట్ శక్తుల్లో మగ్గుతుందని, కార్మికులు చెమటోడ్చి సంపాదించిన దేశ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని, మహిళా సాధికారత గురించి పదేపదే మాట్లాడే బీజేపీ నేతలు.. వారి రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదని శ్రీనివాస్ ప్రశ్నించారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను మోసం చేస్తుందని.. అర్హులకు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ బద్లావ్ జరూరీ హై – మార్పు కావాలని సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు సెప్టెంబర్ 1న డిల్లీలో జరిగే ఆందోళనకు భారీగా తరలి రావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
జాతా లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జాతా కో ఆర్డినేటర్స్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, నాగెల్లి లక్ష్మారెడ్డి, సీపీఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, సహాయ కార్యదర్శి సూరం మల్లేశం, ప్రజనాట్య మండలి జిల్లా అధ్యక్షులు వరుకోలు సదానందం, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిట్టల శ్రీనివాస్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మండల నాయకులు కాంతాల తిరుపతి రెడ్డి, ఎల్లా స్వామి, భద్రయ్య, సంతోష్ చారి, బీర్ల స్వాతి, స్వప్న, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

