కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున రూ.5,250 కోట్లు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి రైతు మేళాను మంత్రి ప్రారంభించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ధాన్యం కొనుగోలు, గోదాముల సామర్థ్యం పెంపుపై దృష్టి సారించామని చెప్పారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూ భారతి, సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రయోజనం ఇచ్చే పంటలనే..
వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో అధిక ప్రయోజనం ఇచ్చే పంటలను ఎంచుకోవాలని రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రైతు మేళాలో శాస్త్రవేత్తలు, నిపుణులు అందించే ఆధునిక సాగు పద్ధతులను నేర్చుకుని తోటి రైతులతో పంచుకోవాలని కోరారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. రైతు మేళాలు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు పాల్గొన్నారు.

