కలం, స్పోర్ట్స్: అమెరికాలోని ఒరెగాన్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ U20 ఛాంపియన్‌షిప్‌లో (World Athletics U20 Championships 2026) భారత్ (India) సత్తా చాటింది.రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం మూడు పతకాలను సాధించింది. స్వర్ణం దక్కకపోయినా.. యువ అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై ఆకట్టుకునే ప్రదర్శనతో భారత్‌ను పతకాల పట్టికలో నిలిపారు. భారత్ తరఫున పురుషుల జావెలిన్ త్రోలో ఆశిష్ యాదవ్ రజత పతకం సాధించాడు. పురుషుల హైజంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ రజతం గెలుచుకోగా.. పురుషుల లాంగ్ జంప్‌లో షహనవాజ్ ఖాన్ కాంస్య పతకం అందుకున్నాడు.
యువ అథ్లెట్లపై నీరజ్ ప్రశంసలు
భారత్ ప్రదర్శనపై స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దేశం తరఫున యువ అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారని పేర్కొన్నాడు. పతకాలతో పాటు ప్రపంచ స్థాయి అథ్లెట్లతో పోటీపడటం ద్వారా వారికి లభించిన అనుభవం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. ఇదే జోరును కొనసాగించాలని యువ అథ్లెట్లకు సూచించాడు. ఈసారి భారత్ మూడు పతకాలే సాధించింది. 2021, 2022 ఎడిషన్లలోనూ భారత్ మూడు పతకాలతోనే పోటీని ముగించింది. అయితే జూనియర్ స్థాయిలో భారత అథ్లెటిక్స్ క్రమంగా బలపడుతున్న తీరుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి.
నిరాశపరిచిన పూజా సింగ్
భారత్‌కు మరో పతకం అందిస్తుందని ఆశించిన పూజా సింగ్ మహిళల హైజంప్ ఫైనల్లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆమె 1.84 మీటర్ల ఎత్తును క్లియర్ చేసింది. అయితే 1.87 మీటర్ల వద్ద మూడు ప్రయత్నాలలోనూ విఫలమైంది. పూజా సింగ్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 1.93 మీటర్లు. మేలో జరిగిన ఆసియా U20 ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన సమయంలో ఆమె ఈ రికార్డును నమోదు చేసింది. మహిళల హైజంప్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఇజొబెల్ లూయిసన్-రో 1.92 మీటర్లతో స్వర్ణం సాధించింది. హంగరీకి చెందిన లిలియానా బటోరి రజతం, స్పెయిన్‌కు చెందిన ఐతానా అలోన్సో కాంస్య పతకం గెలుచుకున్నారు.
రిలేలో తొమ్మిదో స్థానం
మహిళల 4×400 మీటర్ల రిలేలో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. భారత బృందం 3:45.28 నిమిషాలలో రేసును పూర్తి చేసింది. 2002 నుంచి 2018 వరకు భారత్ U20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో కేవలం నాలుగు పతకాలే సాధించింది. ఆ తర్వాత భారత యువ అథ్లెట్ల ప్రదర్శనలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 2016లో నీరజ్ చోప్రా, 2018లో హిమా దాస్ చారిత్రాత్మక స్వర్ణ పతకాలు సాధించారు. ఈసారి స్వర్ణం దక్కకపోయినా మూడు పతకాలతో భారత్ పోటీని ముగించింది. అంతర్జాతీయ స్థాయిలో యువ అథ్లెట్లకు విలువైన అనుభవం లభించడంతో.. భవిష్యత్తులో భారత అథ్లెటిక్స్ మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

