కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఇథనాల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. ఇథనాల్, పెట్రోల్.. వీటిలో ఏది మంచిదో జనాలకు ప్రయోగపూర్వకంగా వివరించేందుకు ప్రయత్నం చేశారు. రెండు కప్‌లు తీసుకుని.. ఒక దానిలో ఇథనాల్, మరొకదానిలో పెట్రోల్ పోసి మంట పెట్టారు. ఆరిపోయిన తరువాత పరిశీలించగా.. ఇథనాల్ ఉన్న కప్పులో ఎలాంటి బూడిద రాలేదు. పెట్రోల్ పోసిన కప్పు మాత్రం బూడిదతో నల్లగా మారిపోయింది.
ఇథనాల్ మాత్రమే వాడుదాం..
వాహనాల్లో ఇథనాల్ వాడటం వలన ఎలాంటి నష్టం ఉండదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇథనాల్ వేసిన కప్పు మండినంత సేపు ఎలాంటి విష వాయువులు వెలువడలేదన్నారు. మంట మండినట్లు కూడా కనిపించడం లేదని, కనీసం బూడిద కూడా ఏర్పడలేదన్నారు. అదే పెట్రోల్ పోసిన కప్పు మాత్రం ఎర్రగా మండుతూ, పర్యావరణానికి హాని కలిగించే వాయువులను విడుదల చేస్తోందన్నారు.
ఇథనాల్ భూమి మీద పండించే మొక్కజొన్న వంటి పంటలతో వస్తుందని, దాన్ని వాడటం వలన దేశ రైతులకు కూడా లాభం ఉంటుందన్నారు. పెట్రోల్ అనేది భూమి లోపలి శిలాజాల నుంచి తీయాలని, పైగా విదేశాల నుంచే కొనాల్సి వస్తోందన్నారు. ఇథనాల్ వాడి రైతులు, పర్యావరణ రక్షించుకుందామని.. పెట్రోల్ వాడకం తగ్గించి దేశం డబ్బులను ఆదా చేద్దామని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) పిలుపునిచ్చారు.
Also Read : పార్లమెంట్‌కు రావాలంటేనే వారికి భయం: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

