కలం, నిర్మల్: నేరాలను అరికట్టేందుకు రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు వృద్ధులు, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా వర్గాలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై సంబంధిత ఎస్డీపీఓలు మెమోలు జారీ చేసి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎస్పీ (Nirmal SP) ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ డేటాను నిరంతరం అప్డేట్ చేయడంతో పాటు మాన్యువల్ రికార్డులు, సీసీటీఎన్ఎస్ నమోదుల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు. జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
నేరస్తుల కదలికలను ముందుగానే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు భద్రతపై మరింత భరోసా కల్పించేలా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. నేర నియంత్రణలో నిర్లక్ష్యానికి తావులేకుండా పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు గోవర్ధన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, కృష్ణ, రవీందర్ నాయక్, సమ్మయ్య, సాయి కుమార్, దీపక్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : చిట్యాల్‌లో ప్లాస్టిక్ నిషేధం.. రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
Follow Us On : WhatsApp

