కలం, మునుగోడు : బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేడు కార్పొరేట్ పెట్టుబడిదారులు, మతోన్మాద శక్తుల విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు పెద్ద ఎత్తున పోరాటాలలోకి రావాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జైల్‌భరో కార్యక్రమంలో (Jail Bharo Protest) భాగంగా సోమవారం చండూరు (Chandur) మండల కేంద్రంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌కు సంబంధించి ఫైనల్ రూల్స్‌ను నోటిఫై చేయడం, విద్యుత్ సవరణ బిల్లు–2025, విత్తన చట్టానికి సవరణలు వంటి చర్యలకు పూనుకోవడం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.
12 గంటల పని విధానంపై ఆగ్రహం
కార్మికుల శ్రమను మరింతగా దోచుకునేందుకు పని దినాలను పెంచుతూ, రోజువారీ పని సమయాన్ని 8 గంటల నుంచి 12 గంటల వరకు పెంచుకునే విధంగా యజమాన్యాలకు స్వేచ్ఛ కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 8 గంటల పని, సమ్మె హక్కు, కార్మిక సంఘాల హక్కులు, ఉద్యోగ భద్రత వంటి హక్కులను లేబర్ కోడ్స్ ద్వారా కాలరాస్తున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాల గుర్తింపు, రిజిస్ట్రేషన్‌పై కఠిన ఆంక్షలు విధించడం ద్వారా కార్మికుల సంఘటిత పోరాటాలను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్స్ అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కార్మికవర్గం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
అసంఘటిత కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని బండ శ్రీశైలం అన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, వెల్ఫేర్ బోర్డులపై కోతలు, ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన పథకం, ఐకేపీ, వీఏఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యశాఖలోని వివిధ స్కీమ్‌లలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
ఉపాధి హామీకి 200 రోజుల పని కల్పించాలి
గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో ప్రజలు ఉపాధి హామీ పనులపై ఆధారపడుతున్నారని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కఠిన నిర్ణయాల వల్ల ఉపాధి హామీ పథకం నీరుగారిపోతోందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించి గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చే విధానాలను విడనాడి రైతు, కార్మిక, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడే విధానాలను పాలకులు అవలంబించాలని కోరారు. ప్రజా వ్యతిరేక, కార్మిక–రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
భారీగా పాల్గొన్న కార్మిక, రైతు సంఘాల నాయకులు
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జెర్రిపోతుల ధనంజయ, చిట్టి మల్ల లింగయ్య, మొగుదాల వెంకటేశం, రైతు సంఘం నాయకులు ఈరటి వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బల్లెం స్వామి, గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు శంకర్, సైదులు, దాసరి కృష్ణయ్య, బిక్షమయ్య, యాదయ్య, నరసింహ, మున్సిపల్ యూనియన్ నాయకులు నల్లగంటి లింగస్వామి, కత్తుల సైదులు, బిపంగి నాగరాజు, గండూరి వెంకన్నతో పాటు మహిళా కార్మికులు రేణుక, కలమ్మ, ముత్తమ్మ, అలివేలు, జంగమ్మ, పెద్ద వెంకన్న, ఎల్లమ్మ, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, గొల్లూరి నాగరాజు, రామ్మూర్తి, బిక్షం, నగేష్, సుమన్, నరేష్, శివ, సత్తయ్య, గిరి, కుమార్, జగన్, విజయ్, రమేష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కృష్ణా తీరంలో వరుణ యాగం.. సీఎం దంపతుల ప్రత్యేక పూజలు
Follow Us On : WhatsApp

