ఉమ్మడి నల్గొండ జిల్లాలో దారి మళ్లుతున్న సన్నబియ్యం

కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అందించే సన్నబియ్యం దారి మళ్లుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రేషన్ బియ్యం (Nalgonda Ration Rice) అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 2,082 షాపుల్లో ప్రతి నెలా పంపిణీ చేసే సన్నబియ్యం నాణ్యత అధ్వానంగా మారింది. రేషన్ బియ్యం డీలర్ వద్దకు వెళ్లి తెచ్చుకున్నాక ఇంట్లో బస్తా విప్పి చూస్తే లబ్ధిదారులు ఆశ్చర్యపోయే ఘటనలు ఉంటున్నాయి. సన్నబియ్యంలో విపరీతమైన దుమ్ము, ధూళి, రాళ్లతో పాటు లక్క పురుగులు వస్తున్నాయి. పురుగులు పట్టిన, వాసన పట్టిన బియ్యాన్ని వండుకోలేక, పారబోయలేని దుస్థితి ఉంటుంది.

గోదాముల నుంచి నేరుగా..

ప్రభుత్వ రూల్స్ మేరకు లబ్ధిదారుల నుంచి బియ్యం తిరిగి కొనుగోలు చేయడం లేదా నగదు ఇవ్వడం చట్టరీత్యా నేరం. కానీ, ఇక్కడ రెండు రకాల అక్రమాలు సాగుతున్నాయి. గోదాముల నుంచి రేషన్ షాపులకు రావాల్సిన ప్రతినెలా బియ్యం కోటా అసలు షాపులకే చేరడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ బియ్యం బస్తాలను నేరుగా మిల్లర్లు, బ్లాక్ మార్కెట్ వ్యాపారులకు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షాపులో నెలల తరబడి నిల్వ ఉండిపోయిన పురుగులు పట్టిన పాత బస్తాలనే ప్రదర్శనకు ఉంచి, ప్రతి నెలా లబ్ధిదారులను భయపెట్టి పంపుతున్నారు. బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చి పంపుతూ.. అసలు బియ్యం బయటి మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ దందాకు పాల్పడుతున్నారు. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాలో 2.21 లక్షల క్వింటాళ్ల సన్నబియ్యం పేదల కోసం సరఫరా అవుతుంటే, అందులో ఎక్కువగా బ్లాక్ మార్కెట్ పాలు కావడం, లబ్ధిదారుల చేతికి పురుగుల బియ్యం లేదా డబ్బులు ఇవ్వడం చేస్తూ ప్రజా పంపిణీ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణలోపం

పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమ దందాను మరింతగా ప్రోత్సహిస్తోంది. రేషన్ షాపుల్లో ఉన్న స్టాక్ ఎంత?. ఈ -పాస్ మెషీన్ల ప్రకారం పంపిణీ అయిన బియ్యం ఎంత?. గోదాముల నుంచి పంపిణీ అయిన నిల్వలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ మూడింటినీ సరిపోల్చి విజిలెన్స్ తనిఖీలు చేపడితే రూ. కోట్లలో ‘రేషన్ స్కామ్’ బయటపడడం ఖాయం. కానీ, ఉన్నతాధికారులు పట్టించుకోకుండా ఉండిపోతున్నారు. ప్రజలు, ప్రజాసంఘాల నేతలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు ఉమ్మడి జిల్లాలోని రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, పురుగుల బియ్యం పంపిణీ చేస్తున్న దందాను, రేషన్ మాఫియాను అరికట్టాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు కోరుతున్నారు.

నాణ్యతలేని బియ్యాన్ని ఇస్తూ..

నల్లగొండ టౌన్లో ఏకంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు ఆఫీసు సమీపంలోని రేషన్ షాపుల్లోనే రేషన్ అక్రమాలు బహిరంగంగా సాగుతుండడం గమనార్హం. లబ్ధిదారులు రాకముందే ఐదారు బస్తాలను ఓపెన్ చేసి, సగం మాత్రమే బియ్యంతో సిద్ధంగా ఉంచుతారు. ఆ బియ్యం ఎంత దారుణంగా ఉంటాయంటే, చూడగానే ఏ లబ్ధిదారుడైనా తీసుకెళ్లడానికి నిరాకరిస్తారు. అతని అయిష్టతను ఆసరాగా చేసుకుని డీలర్లు.. బియ్యం తీసుకెళ్తావా..? లేక వేలిముద్ర వేసి డబ్బులు తీసుకుంటావా..?. అంటూ ఆఫర్ ఇస్తున్నారు. లబ్ధిదారులు బియ్యం నాణ్యత సరిగా లేకపోవడంతో చేసేదేమీ లేక వేలిముద్ర వేసి, డీలర్ ఇచ్చే అరకొర డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితులు ఉంటున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>