శ్రీకాకుళంలో హైడ్రామా.. జైలుకు చింతాడ రవి కుమార్

కలం, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవి కుమార్‌ (Chintada Ravi Kumar)ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు అరెస్ట్ సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. చిలకపాలెం జంక్షన్ వద్ద చింతాడ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయన్ను నేరుగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం రోడ్డుపై నడిపిస్తూనే.. కోర్ట్ వరకు తీసుకెళ్లారు. చింతాడ రవి అరెస్టును వైసీపీ శ్రేణులు ఖండించాయి. అక్రమ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించాయి.

అసలు ఏం జరిగిందంటే…

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు ఇటీవల వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం వచ్చారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు చింతాడ రవి కుమార్‌ తన అనుచరులతో కలిసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై ప్రవళ్లిక వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో చింతాడ రవి కుమార్‌, ఆయన అనుచరులు ఆమెపైకి దూసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. మహిళా ఎస్సైపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసే ప్రయత్నం కూడా చేశారంటూ కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ అవడంతో పాటు చింతాడ రవి కుమార్‌తో పాటు పలువురిపైనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు పరారీలో ఉన్న ఆయన్ను తాజాగా అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు.

ఇదంతా లోకేశ్ ప్లాన్..

అరెస్ట్ సందర్భంగా చింతాడ రవి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తానే శ్రీకాకుళం డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వస్తున్నట్లు వివరించారు. ఎస్సైని తాను ఏం అనలేదని.. అయినా ఏదో జరిగిందన్నట్లుగా క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సైని బలిపశువును చేసి మంత్రి లోకేశ్ తమ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు. తమ కార్యకర్తలను ఆముదాలవలస పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు. సుమారు 60 మంది కార్యకర్తల ఆచూకీ కనిపించడం లేదన్నారు. వారి ఇబ్బందులు చూడలేకనే తానే లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>