కలం, వెబ్ డెస్క్: రాజమహేంద్రవరంలో కారుతో యువకులు ఢీకొట్టిన ఘటనతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (Doctor Priyanka) కన్నుమూశారు. ఆమెను బతికించడానికి వైద్యులు శతవిధాలా ప్రయత్నాలు చేసినా.. ప్రాణాలతో పోరాడుతూ మరణించారు. మధ్యాహ్నం 3.22 గంటలకు ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల మూడో తేదీన రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్య మాల్ సమీపంలో డాక్టర్ ప్రియాంకను ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారు నడుపుకుంటూ వచ్చి వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడగా.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు.
కుటుంబంలో తొలి డాక్టర్..
గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. డాక్టర్ కావాలనే కలతో వైద్య విద్యను ఎంచుకున్న ఆమె చదువుల్లో ఉన్నతంగా రాణిస్తూ వస్తున్నారు. కుటుంబంలో ప్రియాంకనే మొదటి డాక్టర్. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందనే విషయం తెలియగానే ఆమె తల్లి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెకు కూడా చికిత్స అందిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం సీరియస్..
ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇష్టారీతిన కారు నడిపిన సూరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్‌లను వెంటనే రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరిని అత్యంత కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

