నిర్మల్ కమలంలో అంతర్గత కలకలం!

కలం, నిర్మల్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతుండగా.. నిర్మల్ జిల్లాలో మాత్రం పార్టీ అంతర్గత పరిస్థితులపై అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా రితీష్ రాథోడ్ నియామకమై దాదాపు ఏడాదిన్నర పూర్తవుతున్నా ఇప్పటివరకు జిల్లా పదాధికారులు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలతో సమగ్ర జిల్లా స్థాయి సమావేశం నిర్వహించకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో జిల్లాలో పార్టీని నడిపించే తీరు, నాయకుల మధ్య సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉట్నూరు కేంద్రంగా పగ్గాలు.. జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఏంటి?

నిర్మల్ జిల్లా బీజేపీ (Nirmal BJP) అధ్యక్ష పదవిని ఉట్నూరు కేంద్రంగా ఉన్న రితీష్ రాథోడ్‌ కు అప్పగించడం అప్పట్లోనే కొంతమంది సీనియర్ నాయకుల్లో అసంతృప్తికి కారణమైందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగింది. అయితే అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ నాయకులు ముందుకు సాగారు. ఇప్పుడు అధ్యక్షుడి పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహించడం మినహా.. జిల్లా పదాధికారులతో సమీక్షా సమావేశాలు, మండలాల వారీగా పార్టీ పరిస్థితిపై చర్చలు, కార్యకర్తల సమస్యలపై ఆరా, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ వంటి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సీనియర్లు దూరం.. అధిష్టానం ఆరా తీసేదెప్పుడు?

పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన కొందరు సీనియర్ నాయకులు ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ కార్యకర్తల్లో ఉంది. నాయకుల మధ్య సమన్వయం పెంచి.. సీనియర్లు, యువత, క్షేత్రస్థాయి కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియర్లు పార్టీకి ఎందుకు దూరమవుతున్నారు? కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? జిల్లా నాయకత్వంలో సమన్వయం ఎందుకు కొరవడుతోంది? అనే అంశాలపై రాష్ట్ర అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

ఎమ్మెల్యేలు ఉన్నా.. కార్యకర్తల గోడు వినేవారేరీ?

నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీ కోసం శ్రమించిన గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను చెప్పుకునేందుకు సరైన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారనే చర్చ సాగుతోంది. ఎన్నికల వేళ కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పిన పార్టీ పెద్దలు ఎన్నికల తర్వాత అదే కార్యకర్తల సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఆ ఊపును క్షేత్రస్థాయిలో కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపిస్తే.. అది భవిష్యత్తులో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏడాదిన్నర పాలనపై సమీక్ష ఎప్పుడు?

జిల్లా అధ్యక్షుడి పనితీరుపై వినిపిస్తున్న అసంతృప్తి స్వరాల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఇకనైనా స్పందించాలనే డిమాండ్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జిల్లా పదాధికారులు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, బూత్ స్థాయి కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించి పార్టీ పరిస్థితిపై సమగ్ర సమీక్ష చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ముందుగా కార్యకర్తలను కలుపుకొని నాయకులను సమన్వయం చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నారు. అయితే నిర్మల్ జిల్లా బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న అసంతృప్తి స్వరాలకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందా..? జిల్లా నాయకత్వం ఇకనైనా కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందో లేదో వేచి చూడాలి.

సీనియర్లను విస్మరిస్తే.. ప్రాంతీయ పార్టీల బాటే

పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకుండా ముందుకు సాగితే.. రాబోయే రోజుల్లో పలువురు నేతలు ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధిష్ఠానం సీనియర్లను సమన్వయం చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీనియర్ల అనుభవం, కార్యకర్తల బలం, యువత ఉత్సాహాన్ని సమన్వయం చేస్తేనే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>