కలం, వెబ్ డెస్క్ : ఫుకెట్ నుంచి ఢిల్లీకి ఆగస్టు 4న వస్తున్న ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఊహించని ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణంలో ఒక్కసారిగా తీవ్రమైన గాలి అలజడి ఏర్పడి విమానం సుమారు 300 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదం సుమారు 4 నుంచి 5 నిమిషాల పాటు కొనసాగడంతో విమాన సిబ్బందితో సహా 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
షాకింగ్ నిజాలు వెలుగులోకి
ఈ ఘటన జరిగిన సమయంలో విమానాన్ని నడిపిన కెప్టెన్ (Air India Pilot) పోస్ట్-ఫ్లైట్ డోప్ టెస్ట్‌లో సైకోయాక్టివ్ పదార్థాల ఆనవాళ్లు గుర్తించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత జరిపిన వైద్య పరీక్షల్లో కెప్టెన్ మత్తు పదార్థాలు ఉపయోగించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఎయిర్ ఇండియా, డీజీసీఏ స్పందన
డ్రగ్ టెస్ట్ ఫలితాలకు సంబంధించిన అధికారిక సమాచారం తమకు ఇంకా అందలేదని ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి విమానంలో పనిచేసిన సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారు. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు ఎయిర్‌పోర్టులో బాధితులకు సరైన అత్యవసర సహాయక చర్యలు అందించలేదని ఆరోపిస్తూ ఒక ప్రయాణికుడు ప్రత్యేకంగా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

