కలం, జోగులాంబ గద్వాల: మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలో నుంచి జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో జూరాల గేట్లు మూసి వేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి 80,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. విద్యుదుత్పత్తి కోసం 36,233 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. డ్యాం నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.663 టీఎంసీలు నిల్వ ఉన్నది. నెట్టెంపాడు లిఫ్ట్, భీమా లిఫ్ట్-1, కుడి, ఎడమ, సమాంతర కాలువకు నీటిని వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తంగా 39,608 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
ఆగిన అలల సవ్వడి
శనివారం వరకు భారీ వరద ఉధృతితో గలగలపారే కృష్ణమ్మ సవ్వడి చేస్తూ దిగువకు పరుగులెత్తింది. నిండుకుండలా మారిన ప్రాజెక్టు, ఉగ్రరూపంతో పొంగిపొర్లుతున్న కృష్ణమ్మ సౌందర్యాన్ని, జలపాతాలను తలపించే నీటి ధారలను తిలకించేందుకు సందర్శకులు, పర్యాటకులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టుకు వచ్చే వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసి ఇన్ ఫ్లో పెరిగితే, పరిస్థితికి అనుగుణంగా తిరిగి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

