కలం, వెబ్‌డెస్క్: ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా (Raghav Chadha) కు కేంద్ర విద్యాశాఖ పదవి దక్కవచ్చని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో రాఘవ్ చద్దా భేటీ అయ్యారు. అనంతరం రాజకీయ వర్గాల్లో ఈ చర్చ మొదలైంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను చద్దా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సమావేశం చాలా విలువైనదని.. సుదీర్ఘంగా సాగిందని చద్దా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మోదీకి కృతజ్ఞతలు
మోదీతో సమావేశం అనంతరం చద్దా తన ఎక్స్ ఖాతాలో ఫొటోలను పోస్టు చేశారు. ‘ఈ ఉదయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభించింది. సుదీర్ఘమైన, విలువైన చర్చ జరిగింది. ఆయన విలువైన సమయాన్ని కేటాయించడంతో పాటు తన అనుభవం, మార్గదర్శకత్వం పంచుకున్నందుకు కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.
చద్దా వైఖరితో జోరందుకున్న చర్చ
ఇటీవల పార్లమెంటులో చద్దా వ్యవహరించిన తీరు కూడా ఈ చర్చలకు కారణమవుతున్నది. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలకు ఆయన మద్దతు తెలిపారు. పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలన్న ప్రభుత్వ వైఖరిని ప్రశంసించారు. రాజ్యసభలో కేంద్రం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కూడా ఆయన సమర్థించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సయమంలోనే..
ఇటీవల సీజీపీ ఆందోళనల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. ఈ సమయంలోనే రాఘవ్ చద్దా పేరు తెరమీదకు వచ్చింది. తాజాగా ప్రధాని మోదీతో ఆయన భేటీ కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
మోదీతో భేటీ సాధారణమేనా?
ఒకప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడిగా ఉన్న చద్దా.. ఇటీవల రాజకీయంగా కీలక ముందడుగు వేశారు. గత ఏప్రిల్‌లో ఆప్‌కు రాజీనామా చేసి.. ఏడుగురు రాజ్యసభ సభ్యులతో కలిసి బీజేపీలో చేరారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీతో జరిగిన భేటీ సాధారణమేనా? లేదంటే కీలక చర్చ ఏదైనా జరిగిందా? అన్నది వేచి చూడాలి.

