రసవత్తరం‌గా పట్టభద్రుల పోరు.. నిరుద్యోగ ఓటర్ల కోసం అభ్యర్థుల ‘యాప్’ మంత్రం!

కలం, ఖమ్మం బ్యూరో: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) సమరం రోజుకో మలుపు తిరుగుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగ ఓటర్లే లక్ష్యంగా సాగుతున్న ఈ పోరులో బీఆర్ఎస్ తన “ఉచిత కోచింగ్ యాప్” ఆయుధంతో క్షేత్రస్థాయిలో వేగంగా దూసుకుపోతుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం సరైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు సుదీర్ఘ సమీక్షలు, భేటీలకే పరిమితమవుతోంది. ​గ్రాడ్యుయేట్ స్థానాల్లో రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారతాయో గత ఎన్నికల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2021 సాధారణ ఎన్నికలలో దాదాపు 5 లక్షల మంది నమోదిత ఓటర్లు, 72 మంది అభ్యర్థులు పోటీ పడగా, సుదీర్ఘమైన కౌంటింగ్ ప్రక్రియ, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కల తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.

అయితే, ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయడంతో మే 2024లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఉపఎన్నిక ఫలితాలు ‘యాప్ మంత్రం’ చూపిన ప్రభావాన్ని స్పష్టంగా నిరూపించాయి. ఉచిత కోచింగ్ యాప్, పుస్తకాల పంపిణీ వ్యూహంతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ఏకంగా 29,697 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించి ప్రధాన పార్టీల దిగ్గజాలకు షాక్ ఇచ్చారు. ఇక ఇదే కోచింగ్ యాప్ ఫార్ములాను విసృతంగా నిరుద్యోగుల్లోకి తీసుకెళ్లిన నాటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లతో సంచలన విజయాన్ని అందుకోగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి 1,04,248 ఓట్లు సాధించి తీవ్ర పోటీనిచ్చారు. అలాగే బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి 43,313 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

​గత ఉపఎన్నికలో ఈ డిజిటల్ వ్యూహం తెచ్చిన 18,565 ఓట్ల తేడానే ఓటమికి కారణమని గ్రహించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి, ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందస్తుగా అదే సక్సెస్ ఫార్ములాను నమ్ముకున్నారు. ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోచింగ్ యాప్‌ను రూపొందించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వేలాది మంది నిరుద్యోగుల ఫోన్ స్క్రీన్లపై నిరంతరం కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్ మెసేజ్ ల రూపంలో నిలుస్తున్నారు. అంతేకాకుండా, ఇటీవల ఖమ్మంలో నోటిఫికేషన్లు రాక ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పరామర్శించి కేటీఆర్‌తో మాట్లాడించడం ద్వారా నిరుద్యోగుల వైపు నిలబడే నేతగా మైలేజ్ సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

​మరోవైపు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష అభ్యర్థి క్షేత్రస్థాయిని చుట్టేస్తుంటే, కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఇంకా సమీక్షా సమావేశాలకే సమయం కేటాయిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు హైదరాబాద్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు మంత్రులు తమ తమ అనుచరులకే టికెట్ దక్కాలని గట్టిగా పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి సవాలుగా మారినట్లు తెలుస్తోంది.

​గతంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచి 2027 మార్చి 29 వరకు పదవీకాలం ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పుడు “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” పేరిట సొంత దారి చూసుకోవడం, కాంగ్రెస్ సొంతంగా బరిలోకి దిగుతుండటంతో ఈసారి ఇక్కడ బహుముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. సుదీర్ఘమైన కౌంటింగ్ ప్రక్రియ సాగే ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లే తుది విజేతను తేల్చనున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లపై ఉన్న నమ్మకం, మరోవైపు ప్రతిపక్ష నేతలు తెస్తున్న ఉచిత కోచింగ్ యాప్‌ల డిజిటల్ ఎర.. ఈ రెండింటి మధ్య పట్టభద్ర ఓటర్లు రాబోయే పోరులో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>