కలం, ఖమ్మం బ్యూరో: ఆస్తి దాహం ఓ వ్యక్తిని పశువుకంటే హీనంగా మార్చింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అత్తనే పక్కా పథకం ప్రకారం దారుణంగా అంతమొందించాడు. అంతటితో ఆగక తన నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని కాల్చి బూడిద చేసిన అత్యంత క్రూరమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ( Sathupalli Murder) మండలం తుమ్మూరు గ్రామంలో వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మూరు గ్రామానికి చెందిన వెదుళ్ల వెంకట నరసమ్మ (60) ఈ నెల 3వ తేదీన హఠాత్తుగా కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో, మృతురాలి కూతుళ్లు సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా కుటుంబంలోని ఆస్తి వివాదాలపై దృష్టి సారించిన పోలీసులకు, మృతురాలి అల్లుడు గుండాల తిరుపతిరావు ప్రవర్తనపై అనుమానం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, ఆస్తి వివాదం కారణంగానే అత్తను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం ఎలాంటి సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు, మృతదేహాన్ని గ్రామ శివారులోని తోటల్లోకి తీసుకెళ్లి దహనం చేసి బూడిద చేసినట్లు వెల్లడించాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి గ్రామ శివారు తోటల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అక్కడ లభ్యమైన వెంకట నరసమ్మ కాలి బూడిదైన అస్థికలను ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. చట్టపరమైన ఆధారాల కోసం ఆ అస్థికలను డీఎన్ఏ పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడితో పాటు సంబంధం ఉన్న ఇతర నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.

