ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం: నెల్లికంటి సత్యం

కలం, మునుగోడు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలే ప్రశ్నించి తిప్పికొట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (MLC Nellikanti Satyam) పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 12 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య బైక్ యాత్రను శుక్రవారం చండూరు మండలం బంగారి గడ్డ గ్రామంలోని తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మబిక్షం విగ్రహం వద్ద ఎమ్మెల్సీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా వాటిని నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరుతో హామీలు ఇచ్చి మోసం చేశారని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రజల ఆస్తులను కొద్దిమంది చేతులలో పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రైతులు, కార్మికులు, కూలీలు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజలకు ఈ అంశాలపై అవగాహన కల్పించి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే సిపిఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రల లక్ష్యమని తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని, కేంద్ర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాకు జీవనాడిగా ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటం బాధాకరమని ఎమ్మెల్సీ అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితేనే జిల్లాలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేసి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

తక్కువ వర్షపాతం కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోయాయని, బోరు బావులపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న వరి పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నల్పరాజు రామలింగయ్య, సిపిఐ చండూరు మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, మండల నాయకులు, ప్రజా నాట్యమండలి ప్రతినిధులు, మాజీ ZPTC మాధగోని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>