కలం, వనపర్తి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వనపర్తి (Wanaparthy) జిల్లా రైతులు వరి సాగుకు బదులుగా ఆయిల్‌పామ్ వంటి అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రైతు భాను జిల్లా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మొదటి మొక్క నాటి నీరు పోశారు. రైతుతో మాట్లాడిన కలెక్టర్ నాలుగు ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటి, బోర్ నీటితో సాగు చేయనున్నట్లు తెలుసుకున్నారు.
సాగు మరింత విస్తరించాలి..
ఆయిల్‌పామ్ రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే వాణిజ్య పంట అని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకుని సాగును విస్తరించాలని రైతులకు సూచించారు. భానును అభినందించిన కలెక్టర్, తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకుని మరింత మంది రైతులు ఈ పంట వైపు మళ్లేలా ప్రోత్సహించాలని కోరారు. రైతులు వ్యవసాయ భూములకు వెళ్లే రహదారి నిర్మించాలని కోరగా, ఉపాధి పథకంలో నిర్మించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీవైఎస్‌వో సుధీర్‌రెడ్డి, డీహెచ్‌ఎస్‌వో విజయ్‌భాస్కర్, తహసీల్దార్, ఎంపీడీవో, సర్పంచ్ లోకారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

