బెంగాల్‌లో ప్రార్థ‌నా మందిరాల్లో లౌడ్ స్పీక‌ర్ల తొల‌గింపు

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్రార్థ‌నా మందిరాల వ‌ద్ద పెడుతున్న లౌడ్ స్పీక‌ర్ల‌ (Loudspeakers) పై ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో శబ్ద కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా లౌడ్ స్పీకర్ల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఇప్పటి వరకు వివిధ ప్రార్థనా మందిరాల నుంచి మొత్తం 5,299 లౌడ్‌స్పీకర్‌లను తొలగించినట్లు సీఎం సువేందు అధికారి వెల్లడించారు. ఇందులో మసీదుల నుంచి 4,203, ఆలయాల నుంచి 1,096 లౌడ్‌స్పీకర్‌లను తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. కోల్‌క‌తా హైకోర్టు ఆదేశాల అనుగుణంగానే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయ‌న వెల్ల‌డించారు. ఇందులో ఎలాంటి బలవంతపు తొలగింపులు జరగలేదని, అందరూ అధికారులకు సహకరిస్తున్నారని తెలిపారు. బీజేపీ దీన్ని చట్టబద్ధమైన చర్యగా సమర్థిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మసీదు కమిటీలు పోలీసులకు సహకరించాలని ఆల్ బెంగాల్ ఇమామ్ అండ్ ముయాజ్జిన్ అసోసియేషన్ కోరింది. లౌడ్‌స్పీకర్ల తొలగింపును అడ్డుకోవద్దని సూచించింది. భవిష్యత్తులో న్యాయపరమైన పోరాటం కోసం లౌడ్ స్పీక‌ర్‌ల తొల‌గింపు ప్రక్రియను వీడియోలు, ఫోటోల రూపంలో భద్రపరుచుకోవాలని సూచించింది. మరోవైపు ఇది మతపరమైన అంశం కాదని, శబ్ద కాలుష్య నిబంధనలను అమలు చేయడమేనని రాష్ట్ర బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయితే ప్రజా సమస్యలను గాలికొదిలి ప్రభుత్వం ఇలాంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొస్తోంద‌ని టీఎంసీ సహా ఇత‌ర పార్టీలు ఆరోపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>