కలం, జోగులాంబ గద్వాల : గద్వాల ఎగువ ప్రాంతంలోని కర్ణాటక జలాశయాల నుంచి వస్తున్న నీటి ఉధృతితో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గురువారం జూరాల అధికారులు 28 స్పీల్ వే గేట్లు ఎత్తివేసి 1,88,608 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 317.58అడుగులకు చేరింది.
పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిలువ 7.798 టీఎంసీలుగా నమోదయింది. జూరాలకు ఇన్ ప్లో 2,20,000 క్యూసెక్కులుగా ఉండగా దిగువకు శ్రీశైలం వైపు 2,20,558 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలతో పాటు కుడి, ఎడమ కాలువకు సాగు నీటిని యథావిధిగా విడుదల చేస్తున్నారు.

