కలం, స్పోర్ట్స్ : టీమిండియా వరుస సిరీస్ పరాజయాలతో గౌతమ్ గంభీర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గంభీర్ (Gautam Gambhir)పై పరోక్షంగా విమర్శలు చేసినట్టుగా కనిపించిన కైఫ్.. చివరికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పాత్రనే ఎక్కువగా ప్రస్తావించారు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఓటమి తర్వాత.. ఇంగ్లాండ్ చేతిలో వైట్‌బాల్ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ముఖ్యంగా టీ20 సిరీస్‌ను 4-0తో కోల్పోవడంతో గంభీర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.
ఆయనను కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గంభీర్ అందుబాటులో లేని వేళ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో జింబాబ్వేపై భారత్ సునాయాసంగా గెలిచింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన కైఫ్.. లక్ష్మణ్ సంప్రదాయ జట్టు కూర్పునే ఎంచుకున్నారని చెప్పారు. ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగారని గుర్తు చేశారు. కేవలం అదనపు ఆల్‌రౌండర్ కోసం జట్టు సమతుల్యతను మార్చలేదని వివరించారు.
కొత్త కోచ్‌కు ఆరంభంలో విజయాలు రావడం సహజమే అయినా, విదేశీ పర్యటనలలోనే అసలు ఒత్తిడి మొదలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గంభీర్‌పై వస్తున్న విమర్శల్లో కూడా ఇదే అంశం ప్రధానంగా ఉందని చర్చ సాగుతోంది. అదనపు ఆల్‌రౌండర్ కోసం ఒక స్పెషలిస్ట్ బౌలర్‌ను పక్కన పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పరాజయాలకు కోచ్ ఒక్కరినే బాధ్యుడిని చేయలేమని కైఫ్ స్పష్టం చేశారు.
జట్టును ముందుకు నడిపించే బాధ్యత కెప్టెన్‌పైనా ఉంటుందని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలని చెప్పారు. గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించిన సమయంలో గిల్ మంచి నాయకత్వ లక్షణాలు చూపించాడని, భవిష్యత్తులో భారత్‌కు దీర్ఘకాల కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉందని కైఫ్ అభిప్రాయపడ్డారు.

