నూతన కలెక్టరేట్​ ను సందర్శించిన కలెక్టర్​

కలం, కరీంనగర్ బ్యూరో : త్వరలో ప్రారంభం కానున్న నూతన జిల్లా కలెక్టరేట్ భవనానికి కార్యాలయాల తరలింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) అధికారులను ఆదేశించారు. పాత కలెక్టరేట్ నుంచి తరలించే ఫైళ్లు, ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రం నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు.

గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్న వివిధ శాఖల కార్యాలయాలు, అధికారుల ఛాంబర్లు, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, సమావేశ మందిరాలు, వీవీఐపీ గదులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రతి బ్లాక్‌కు సంబంధించిన కార్యాలయాల వివరాలను డయాగ్రామ్ రూపంలో సిద్ధం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఏ శాఖ ఎక్కడ పనిచేయనుందో స్పష్టంగా కనిపించేలా కార్యాలయాల కేటాయింపు చేపట్టాలని సూచించారు.

కలెక్టరేట్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల వివరాలను సేకరించి, ప్రణాళిక ప్రకారం సిట్టింగ్ ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. లయన్ డిపార్ట్‌మెంట్లకు సంబంధించి ఒకటే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయాల్లో ఏసీలు, ఫర్నిచర్, కర్టెన్లు, విద్యుత్, తాగునీటి సదుపాయం, టీ-ఫైబర్ నెట్‌వర్క్ తదితర అన్ని మౌలిక వసతులు ప్రారంభానికి ముందే సిద్ధం చేయాలని ఆదేశించారు. మీటింగ్ హాల్‌తో పాటు వీవీఐపీల సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

కలెక్టరేట్‌కు వచ్చే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఇతర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని షిఫ్టింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి నూతన కలెక్టరేట్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

పాత కలెక్టరేట్ భవనానికి సంబంధించిన రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ భవనానికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిల, ఏవో సుధాకర్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాలీచరణ్, ఆర్ అండ్ బీ ఈఈ కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>